భారత్‌లోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ట్రూకాలర్ కొత్త ఫీచర్
ఈ కొత్త ఏఐ ఫీచర్, వాయిస్ మెసేజ్‌లను వెంటనే టెక్ట్స్‌గా మార్చే (ట్రాన్స్‌క్రిప్షన్) సౌకర్యాన్ని అందిస్తోంది. ముఖ్యంగా పెరుగుతున్న స్పామ్ కాల్స్ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారంగా ఈ ఫీచర్‌ను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది.
- Author : Latha Suma
Date : 18-12-2025 - 4:27 IST
Published By : Hashtagu Telugu Desk
. వాయిస్ మెసేజ్‌లను తక్షణమే టెక్ట్స్ గా మార్చే ఫీచర్
. వాయిస్ మెసేజ్‌లు నేరుగా ఫోన్‌లోనే స్టోర్ అయ్యే సౌకర్యం
. తెలుగుతో సహా 12 భారతీయ భాషల్లో ట్రాన్స్‌క్రిప్షన్
Truecaller voicemail: ప్రముఖ కాలర్ ఐడీ యాప్ ట్రూకాలర్ భారత ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మరో కీలక అడుగు వేసింది. గురువారం ‘ట్రూకాలర్ వాయిస్‌మెయిల్’ పేరుతో పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కొత్త ఏఐ ఫీచర్, వాయిస్ మెసేజ్‌లను వెంటనే టెక్ట్స్‌గా మార్చే (ట్రాన్స్‌క్రిప్షన్) సౌకర్యాన్ని అందిస్తోంది. ముఖ్యంగా పెరుగుతున్న స్పామ్ కాల్స్ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారంగా ఈ ఫీచర్‌ను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. సాంప్రదాయ వాయిస్‌మెయిల్ విధానానికి భిన్నంగా, ట్రూకాలర్ వాయిస్‌మెయిల్‌లో రికార్డ్ అయ్యే అన్ని సందేశాలు యూజర్ ఫోన్‌లోనే సురక్షితంగా నిల్వ అవుతాయి. దీని వల్ల డేటాపై పూర్తి నియంత్రణ వినియోగదారుడికే ఉంటుంది.
పాత విధానాల్లోలాగా పిన్ నంబర్లు గుర్తుపెట్టుకోవడం, ప్రత్యేక వాయిస్‌మెయిల్ నంబర్లకు కాల్ చేయడం వంటి తలనొప్పులు ఇక అవసరం ఉండవు. ఒకే యాప్‌లో వాయిస్ మెసేజ్‌లను వినడం, చదవడం రెండూ సులభంగా చేయవచ్చు. ఈ ఫీచర్‌లో మరో ముఖ్యమైన అంశం మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్. తెలుగు, హిందీ, తమిళం, కన్నడతో పాటు మొత్తం 12 భారతీయ భాషల్లో వాయిస్‌మెయిల్‌ను టెక్ట్స్‌గా మార్చుకునే అవకాశం ట్రూకాలర్ కల్పించింది. దీనివల్ల మీటింగ్‌లో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా వాయిస్ వినడానికి వీలులేని సందర్భాల్లో కూడా మెసేజ్‌లను చదివి వెంటనే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరంగా మారనుంది.
స్పామ్ కాల్స్‌ను ఆటోమేటిక్‌గా గుర్తించి అడ్డుకునే ట్రూకాలర్ టెక్నాలజీకి ఈ వాయిస్‌మెయిల్ ఫీచర్ మరింత బలం చేకూర్చింది. తెలియని లేదా అనుమానాస్పద నంబర్ల నుంచి వచ్చే వాయిస్ మెసేజ్‌లను కూడా ఏఐ ఆధారంగా గుర్తించి యూజర్‌కు స్పష్టమైన సమాచారం అందిస్తుంది. దీంతో అనవసర కాల్స్, మెసేజ్‌ల వల్ల సమయం వృథా కాకుండా ఉంటుంది. ఈ కొత్త సదుపాయంపై ట్రూకాలర్ సీఈఓ రిషిత్ ఝున్‌ఝున్‌వాలా స్పందిస్తూ, “సాంప్రదాయ వాయిస్‌మెయిల్ అనేది పాత తరం కమ్యూనికేషన్ అవసరాల కోసం రూపొందించబడింది. కానీ నేటి డిజిటల్ యుగంలో ప్రజలు కమ్యూనికేట్ చేసే విధానం పూర్తిగా మారిపోయింది.
అందుకే వాయిస్ మెసేజ్‌లను ఉచితంగా, నేరుగా ఫోన్‌లోనే స్టోర్ అయ్యేలా, స్పామ్ రక్షణతో కూడిన ఆధునిక పరిష్కారాన్ని అందిస్తున్నాం” అని తెలిపారు. ప్రస్తుతం ట్రూకాలర్‌ను ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మందికి పైగా వినియోగిస్తున్నారు. కేవలం 2024 సంవత్సరంలోనే సుమారు 56 బిలియన్ల స్పామ్ కాల్స్‌ను ఈ యాప్ గుర్తించి బ్లాక్ చేయడం విశేషం. భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టితో తీసుకొచ్చిన ట్రూకాలర్ వాయిస్‌మెయిల్ ఫీచర్, రాబోయే రోజుల్లో డిజిటల్ కమ్యూనికేషన్ విధానాన్ని మరింత సులభతరం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.