Life On Distant Planet: ఆ గ్రహంపైనా జీవరాశులు.. ఆధారాలు గుర్తించిన సైంటిస్టులు
భూమికి అత్యంత దూరంలో ఉన్న కే2-18బీ గ్రహం(Life On Distant Planet)పై జీవరాశులు ఉండొచ్చనే అంశాన్ని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సైంటిస్టులు తాజాగా గుర్తించారు.
- Author : Pasha
Date : 17-04-2025 - 8:55 IST
Published By : Hashtagu Telugu Desk
Life On Distant Planet: ఇతర గ్రహాలపై కానీ, ఇతర నక్షత్రాలపై కానీ జీవరాశులు ఉన్నాయా ? అనే అంశంపై చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేస్తున్నారు. దీనికి తొలిసారిగా ఒక ఆశాజనక సమాధానం వచ్చింది. భూమికి 700 లక్షల కోట్ల మైళ్ల దూరంలో ఉన్న కే2-18బీ గ్రహం(Life On Distant Planet)పై జీవరాశులు ఉండొచ్చనే అంశాన్ని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సైంటిస్టులు తాజాగా గుర్తించారు. ఆ గ్రహం వాతావరణాన్ని అధ్యయనం చేస్తున్న క్రమంలో ఈ అంశం వెల్లడైంది.
ఆ అణువుల ఉనికిపై క్లారిటీ
భూమిపై ఏకకణ జీవులు వంటివి మాత్రమే ఉత్పత్తి చేసే అణువుల ఉనికిని కే2-18బీ గ్రహంపైనా గుర్తించామని పరిశోధకులు చెప్పారు. జీవరాశుల ఉనికికి సంబంధించిన రసాయనాలను నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్(జేడబ్ల్యుఎస్‌టీ) ద్వారా గుర్తించామన్నారు. కే2-18బీ గ్రహం వాతావరణంలో ఈ తరహా రసాయనాలను గుర్తించడం ఇది రెండోసారి. భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. ఈయన కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఆస్ట్రానమీ ఇనిస్టిట్యూట్‌లో కీలక హోదాలో సేవలు అందిస్తున్నారు.
Also Read :Tesla India : భారత్‌లో టెస్లా చక్కర్లు.. ఫీచర్లు అదుర్స్.. బీవైడీతో ఢీ
అక్కడ మనుషులు జీవించొచ్చు : నిక్కు మధుసూదన్ , పరిశోధనా టీమ్ సారథి
‘‘కే2-18బీ గ్రహంపై జీవరాశుల ఉనికికి సంబంధించి మరింత స్పష్టమైన ఆధారాలు త్వరలోనే లభిస్తాయని నేను నమ్ముతున్నాను. అక్కడ మనుషులు జీవించొచ్చు. దీని బలమైన ఆధారమైతే దొరికింది. రాబోయే రెండేళ్లలో మేం మరింత సమాచారాన్ని రాబడతాం. అక్కడ జీవరాశుల ఉనికిపై ధ్రువీకరణకు వస్తాం’’ అని నిక్కు మధుసూదన్ తెలిపారు. ‘‘డైమిథైల్ సల్ఫైడ్(డీఎంఎస్), డైమిథైల్ డైసల్ఫైడ్(డీఎండీఎస్) అనేవి జీవం ఉనికితో ముడిపడి ఉన్న రెండు అణువులు. మెరైన్ ఫైటోప్లాంక్టన్, బ్యాక్టీరియాలు భూమిపై ఈ వాయువులను ఉత్పత్తి చేస్తుంటాయి. వీటిలో ఒకదానికి సంబంధించిన రసాయన సంకేతాన్ని మేం కే2-18బీ గ్రహం వాతావరణంలో గుర్తించాం. భూమి కంటే కే2-18బీపై వేల రెట్లు అధికంగా ఈ రెండు వాయువులు ఉన్నాయనేది మా అంచనా’’ అని ప్రొఫెసర్ మధుసూదన్ వివరించారు. ‘‘కే2-18బీ గ్రహం భూమి పరిమాణంతో పోలిస్తే రెండున్నర రెట్లు పెద్దది. ఇది భూమి నుంచి 700 ట్రిలియన్ మైళ్ల దూరంలో ఉంది’’ అని ఆయన చెప్పారు.