Drone To Moon : చంద్రుడిపైకి తొలిసారిగా డ్రోన్.. ఎందుకో తెలుసా ?
చంద్రుడి(Drone To Moon) దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల దూరంలో ఉన్న ఓ నిర్దిష్ట ప్రదేశంలో మార్చి 6న అథీనా ల్యాండ్ కానుంది.
- By Pasha Published Date - 11:15 AM, Thu - 27 February 25

Drone To Moon : చంద్రుడిపైకి ఇప్పటివరకు వ్యోమగాములు, రోబోలు, వ్యోమనౌకలు, ల్యాండర్లు, రోవర్లు వెళ్లాయి. అయితే ఇప్పుడు తొలిసారిగా ఒక డ్రోన్ చంద్రుడిపైకి వెళ్తోంది. అమెరికాకు చెందిన ఇంట్యూటివ్ మెషీన్స్ కంపెనీ అథీనా అనే పేరుతో ఒక ల్యాండర్‌ను అభివృద్ధి చేసింది. ఇది ఆరు కోణాలతో షడ్భుజి ఆకారంలో ఉంది. దీన్ని అమెరికాలోని నాసా కెనడీ స్పేస్‌సెంటర్ నుంచి స్పేస్ఎక్స్ కంపెనీ ‘ఫాల్కన్ 9’ రాకెట్‌లో చంద్రుడి దిశగా ప్రయోగించారు. ల్యాండర్ అథీనా లోపల ఒక డ్రోన్ ఉంది. దాని పేరు గ్రేస్.
Also Read :Ramadan 2025 : ‘రంజాన్’ ఎప్పుడు ప్రారంభం అవుతుంది ? ఈద్ ఎప్పుడు ?
డ్రోన్ ఏం చేస్తుందంటే..
చంద్రుడి(Drone To Moon) దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల దూరంలో ఉన్న ఓ నిర్దిష్ట ప్రదేశంలో మార్చి 6న అథీనా ల్యాండ్ కానుంది. అథీనా ల్యాండ్ అయిన తర్వాత, దాని నుంచి డ్రోన్ గ్రేస్ బయటికి వెళ్లి తనకు అప్పగించిన పనిని మొదలుపెట్టనుంది. ఇప్పటివరకు చంద్రుడిపై సూర్య కిరణాలు ఎన్నడూ పడని జెట్ బ్లాక్ బిలంపైకి ఈ డ్రోన్‌ను పంపనున్నారు. ఆ బిలం ఫొటోలను డ్రోన్ తీసి పంపనుంది. అథీనా ల్యాండ్ కానున్న ప్రదేశానికి 400 మీటర్ల దూరంలోనే జెట్ బ్లాక్ బిలం ఉంటుంది. ఇంతకీ ఈ డ్రోన్‌కు గ్రేస్ అనే పేరును ఎందుకు పెట్టారని అనుకుంటున్నారా ? ప్రఖ్యాత కంప్యూటర్ సైంటిస్ట్ గ్రేస్ హోపర్ గౌరవార్ధం డ్రోన్‌కు గ్రేస్ అని నామకరణం చేశారు.
చంద్రుడిపై సెల్యులార్ నెట్‌వర్క్
ల్యాండర్ అథీనా డ్రోన్ గ్రేస్‌తో పాటు పలు ఇతర సాంకేతిక పరికరాలను కూడా తీసుకెళ్లింది. నోకియా బెల్ ల్యాబ్స్ తయారు చేసిన లూనార్ సెల్యులార్ నెట్‌వర్క్‌ను టెస్టింగ్ కోసం అథీనా తీసుకెళ్లింది. ఈ లూనార్ సెల్యులార్ నెట్‌వర్క్‌ను ఒక చిన్నపాటి రోవర్‌కు అమర్చి పంపించారు. ఈ ప్రయోగంలో భాగంగా పంపిన ల్యాండర్, రోవర్, డ్రోన్‌లను చంద్రుడిపై సమన్వయం చేయడానికి ఈ సెల్యులార్ నెట్‌వర్క్‌ను వినియోగించనున్నారు. దీని వినియోగం సక్సెస్ అయితే, భవిష్యత్తులో దీన్ని వ్యోమగాముల సూట్‌లలో భాగంగా చేర్చనున్నారు.