Ramadan 2025 : ‘రంజాన్’ ఎప్పుడు ప్రారంభం అవుతుంది ? ఈద్ ఎప్పుడు ?
రంజాన్ (Ramadan 2025) నెలలో ముస్లింలు ఉపవాసం, ప్రార్థనలు, సమాజ సేవతో కాలం గడుపుతారు.
- By Pasha Published Date - 10:32 AM, Thu - 27 February 25

Ramadan 2025 : పవిత్ర రంజాన్ మాసం వస్తోంది. ఇస్లామిక్ క్యాలెండర్‌లో 9వ నెల పేరు రంజాన్. ఈ నెలలో ప్రతిరోజు ముస్లింలు ఉపవాస దీక్షలను పాటిస్తుంటారు. అయితే నెలవంక కనిపించిన తర్వాతే ఉపవాస దీక్షలు మొదలవుతాయి. ఈసారి భారత్‌లో ఫిబ్రవరి 28వ తేదీన సాయంత్రం నెలవంక కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ముస్లింలు మార్చి 1 నుంచి రంజాన్ ఉపవాసాలను మొదలుపెడతారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో నెలవంక దర్శనం వేర్వేరు సమయాల్లో ఉంటుంది. అందువల్ల ఆయా ప్రాంతాల్లోని ముస్లిం మత పెద్దలు రంజాన్ మాసం ప్రారంభం గురించి ప్రకటనలు చేస్తుంటారు. నెల రోజుల ఉపవాస దీక్షల తర్వాత మళ్లీ మార్చి 30న నెలవంక కనిపించే అవకాశం ఉంది. ఆ తర్వాత రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) పండుగను జరుపుకుంటారు. ఈసారి మార్చి 31న రంజాన్ పండుగ రావచ్చు.
Also Read :Indians Purchasing Power: 100 కోట్ల మంది భారతీయుల ‘పవర్’పై సంచలన నివేదిక
ఉపవాసం, ప్రార్థనలు, సమాజ సేవ
రంజాన్ (Ramadan 2025) నెలలో ముస్లింలు ఉపవాసం, ప్రార్థనలు, సమాజ సేవతో కాలం గడుపుతారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు సూర్యోదయానికి ముందే భోజనం చేసి, ఉపవాసాన్ని మొదలుపెడతారు. దీన్ని సహరీ అంటారు. సూర్యాస్తమయం తర్వాత భోజనం చేసి, ఉపవాసాన్ని ముగిస్తారు. దీన్ని ఇఫ్తార్ అంటారు. ఉపవాసం క్రమంలో ముస్లింలు ఆహారం కానీ, నీరు కానీ అస్సలు ముట్టరు. సూర్యాస్తమయం తర్వాత నీరు, ఖర్జూరాలతో ఉపవాస దీక్షను ముగిస్తారు. రోజూ రాత్రి వేళ మసీదులలో తరావీహ్ నమాజులు ఉంటాయి. ఇందులో పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని పఠిస్తారు.
Also Read :Telangana State Bird: మిషన్ పాలపిట్ట.. రంగంలోకి తెలంగాణ సర్కార్
వీరికి మినహాయింపులు..
- సుదూర ప్రయాణానికి బయలుదేరే వారికి, రెండు మజిలీలకు మించి పయనించే వారికి ఉపవాసం నుంచి మినహాయింపు ఉంది.
- సుదూర ప్రయాణాల్లో ఉన్నవారు ఉపవాసానికి బదులు తోటి ప్రయాణికులకు సేవ చేయొచ్చు.
- ప్రయాణాలు చేసినవారు వదిలేసిన ఉపవాసాలను తర్వాతి నెల రోజుల్లోగా పూర్తిచేసుకోవాలి.
- గర్భిణులు, పాలిచ్చే తల్లులు, వృద్ధులు, రోగగ్రస్తులకు ఉపవాసం విషయంలో మినహాయింపు ఉంది. అలాంటివారు రోజూ ఒక ఉపవాసికి ఇఫ్తార్ చేయించాలి.