Electric Cars: ఇకపై వైర్ కనెక్షన్ లేకుండానే కారుకు చార్జింగ్.. అదెలా అంటే?
- By Anshu Published Date - 06:30 AM, Thu - 13 April 23

రోజురోజుకీ దేశవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ ధరలు ఆకాశానంటుతున్నాయి. దాంతో ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అంతేకాకుండా ఎక్కువ శాతం మంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్ లు, ఎలక్ట్రిక్ కార్లు విడుదలైన తెలిసిందే. కాగా మార్కెట్ లోకి కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల అవుతున్నప్పటికీ వాటిలో చార్జింగ్ ప్రధాన సమస్యగా ఉంది.
అయితే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కడికి తీసుకొని వెళ్ళినా కూడా చార్జింగ్ అన్నది ప్రధాన సమస్యగా మారుతుంది. చాలామంది ఈ సమస్య కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. కాగా హ్యూందాయ్ మోటార్స్ ఈ సమస్యను దృష్టిలోకి తీసుకొని ఆ సమస్యకు చెక్ పెట్టేలా ఒక కొత్త కాన్సెప్ట్ ను తీసుకువచ్చింది. అదే వైర్ లెస్ చార్జింగ్ టెక్నాలజీ. కారును పార్క్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా చార్జ్ అయ్యే సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం దీని పై పెద్ద ఎత్తున ప్రయోగాలు జరుగుతున్నాయి. కాగా అన్ని కుదిరితే వచ్చే ఏడాది ఈ వైర్ లెస్ చార్జింగ్ విధానాన్ని మార్కెట్లో ఆవిష్కరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
హ్యాందాయ్ కు చెందిన జెనెసిస్ కంపెనీ ఈ వైర్ లెస్ టెక్నాలజీపై ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తోంది. కోరియాలోని ప్రీమియం మార్కెట్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. 2023 జూన్ వరకూ ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఇది స్మార్ట్ ఫోన్లకు వాడే వైర్ లెస్ చార్జింగ్ విధానానికి దగ్గరగా ఉంటుంది. ఇందుకోసం ఒక ప్రత్యేకమైన ప్యాడ్ ను కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ ప్యాడ్ నుంచి మ్యాగ్నటెక్ ఫీల్డ్ సాయంతో కారు వైర్ కనెక్షన్ లేకుండానే చార్జ్ అవుతుంది. ఈ ప్యాడ్ కింద భూమిలో ఉంచుతారు. ఈ ప్యాడ్ పై కారును పార్క్ చేసినప్పుడు ఆ చార్జింగ్ ప్యాడ్ నుంచి కారుకు విద్యుత్ శక్తి అందుతుంటుంది. కాగా ఈ ఎలక్ట్రిక్ ప్యాడ్లను 11కిలోవాట్ల సామర్థ్యంతో 20 వరకూ ఇన్ స్టాల్ చేయాలని జెనెసిస్ కంపెనీ భావిస్తోంది. వీటిని టెస్ చేయడానికి జీవీ60, జీవీ70 అనే రెండు కార్లను కూడా ఆధునిక సాంకేతికతతో కూడిన రిసీవర్లను అమర్చింది. ఈ సందర్భంగా జెనెసిస్ ప్రాడక్ట్ హెడ్ మార్క్ చాయ్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ ను వీలైనంత వేగంగా, సులభంగా పూర్తి చేసేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 11 కిలోవాట్ల సామర్థ్యంతోనే ప్యాడ్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.