Hacker Arrest : కరుడుగట్టిన హ్యాకర్ అరెస్టు.. శభాష్ హైదరాబాద్ సైబర్ పోలీస్ !!
ఏకంగా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకే కన్నం వేస్తున్న కరుడుగట్టిన హ్యాకర్ ను హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు.
- By Hashtag U Published Date - 04:35 PM, Wed - 11 May 22

ఏకంగా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకే కన్నం వేస్తున్న కరుడుగట్టిన హ్యాకర్ ను హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. అతడిని ఢిల్లీకి చెందిన శ్రీరామ్ దినేష్ గా గుర్తించారు. అరెస్టు చేసే సమయానికి హ్యాకర్ శ్రీరామ్ దినేష్ నుంచి రూ.53 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. బ్యాంకు సర్వర్లను హ్యాకింగ్ చేస్తే దొరుకుతామని.. అతడు తొలుత ఒక కస్టమర్ లాగా పేమెంట్ గేట్ వే లోకి ఎంటర్ అయ్యాడు.ఎటువంటి లావాదేవీలు జరుగుతున్నాయనేది అవగాహన తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ సెల్ ఫోన్ నంబర్లు సమర్పించి రూ.53 లక్షలను మూడు వేర్వేరు బ్యాంకు ఖాతాలలోకి పంపాడు. శ్రీరామ్ దినేష్ ఈవిధంగా గత ఐదేళ్లలో దాదాపు రూ.3 కోట్లను బ్యాంకులు, ఆర్ధిక సంస్థల నుంచి తస్కరించాడు.
దోచేసిన డబ్బుతో బిట్ కాయిన్స్ అకౌంట్ తీసుకోవడం.. కొంతకాలం ఆగి ఆ బిట్ కాయిన్స్ అమ్ముకొని డబ్బు తీసుకొని బయటపడటం అతడికి అలవాటుగా మారింది. అయితే.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎథికర్ హ్యాకర్ల సహాయంతో ఇప్పటికే రూ.18 లక్షలను హ్యాకర్ శ్రీరామ్ దినేష్ ఖాతాల నుంచి రికవర్ చేశారు. మరో రూ.15 లక్షలు రావాల్సి ఉందని తెలిపారు. కాగా ,శ్రీరామ్ దినేష్ ఇంజినీరింగ్ డ్రాప్ అవుట్ విద్యార్థి. కంప్యూటర్స్ లో బగ్స్ కనిపెట్టడంలో అతడు దిట్ట. అతడు విజయవాడలో 3 కంపెనీలు స్టార్ట్ చేశాడు. 2021 సంవత్సరంలో ‘బెస్ట్ పే’ అనే యాప్ కు చెందిన గేట్ వే నుంచి లక్షలు కొల్లగొట్టాడు. అతడిపై ఉత్తర భారతదేశంలో ఇప్పటికే ఎన్నో కేసులు ఉన్నాయి. చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న అతడిని హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.