వాట్సాప్ లో ఫొటోలు డౌన్లోడ్ చేస్తున్నారా ? అయితే మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ అయినట్లే !!!
UP లక్నోకు చెందిన ప్రశాంత్ వర్మ వాట్సాప్లో వచ్చిన ఫొటోను డౌన్లోడ్ చేసి రూ.4.44 లక్షలు పోగొట్టుకున్నారు. ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడని, అతని జేబులో మీ గుర్తింపు కార్డు ఉందని కేటుగాళ్లు ఫోన్ చేసి నమ్మించారు
- Author : Sudheer
Date : 22-12-2025 - 1:21 IST
Published By : Hashtagu Telugu Desk
- రోజు రోజుకు రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
- లక్నో కు చెందిన వ్యక్తి వాట్సాప్ లో ఇమేజ్ డౌన్ లోడ్ చేసి లక్షలు పోగొట్టుకున్నాడు
- ‘APK ఫైల్’ సాంకేతికతను ఉపయోగిస్తూ మోసాలు
సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త రకమైన మోసాలతో అమాయకులను నిలువునా ముంచుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన ప్రశాంత్ వర్మ అనే వ్యక్తి కేవలం ఒక వాట్సాప్ ఫొటోను డౌన్లోడ్ చేసి ఏకంగా రూ.4.44 లక్షలు పోగొట్టుకోవడం సంచలనం సృష్టించింది. కేటుగాళ్లు అతనికి ఫోన్ చేసి, ఒక వ్యక్తి ప్రమాదంలో మరణించాడని, అతని జేబులో ప్రశాంత్‌కు సంబంధించిన గుర్తింపు కార్డు (ID Card) దొరికిందని నమ్మించారు. ఆ వ్యక్తి ఎవరో గుర్తుపట్టమంటూ ఒక ఫొటోను వాట్సాప్ ద్వారా పంపారు. ఆందోళనతో ఆ ఫొటోను చూడాలనుకున్న ప్రశాంత్ దాన్ని క్లిక్ చేయడమే ఆయన చేసిన పెద్ద తప్పయింది.

Whatsapp Photo Download
ఈ మోసంలో నేరగాళ్లు అత్యంత ప్రమాదకరమైన ‘APK ఫైల్’ సాంకేతికతను ఉపయోగించారు. సాధారణంగా మనకు వచ్చేవి ఫొటో ఫైల్స్ (.jpg లేదా .png) అయి ఉంటాయి, కానీ కేటుగాళ్లు ఫొటో రూపంలో ఉండే వైరస్ లేదా మాల్వేర్ ఫైల్‌ను పంపారు. ప్రశాంత్ ఆ ఫొటోను డౌన్లోడ్ చేయగానే, అతని ప్రమేయం లేకుండానే ఫోన్‌లో ఒక హానికరమైన అప్లికేషన్ ఇన్స్టాల్ అయిపోయింది. దీని ద్వారా నేరగాళ్లు అతని ఫోన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు (OTP) వారి చేతికి చిక్కడంతో క్షణాల్లోనే అతని ఖాతాలోని రూ.4.44 లక్షలను మాయం చేశారు.
ఈ ఉదంతంపై విచారణ చేపట్టిన పోలీసులు ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వాట్సాప్ సందేశాలు, లింకులు లేదా ఫైల్స్ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మనల్ని భావోద్వేగాలకు గురిచేసేలా (ప్రమాదం జరిగిందని, బహుమతి వచ్చిందని) వచ్చే సందేశాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘Unknown Sources’ నుంచి యాప్స్ ఇన్స్టాల్ కాకుండా సెట్టింగ్స్ మార్చుకోవాలని, అనుమానాస్పద ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే ‘1930’ నంబర్‌కు ఫిర్యాదు చేయడం ద్వారా పోగొట్టుకున్న సొమ్మును తిరిగి పొందే అవకాశం ఉంటుంది.