Aadhaar Card: ఆన్లైన్ లో ఇలా అప్లై చేస్తే చాలు.. మీ ఇంటి వద్దకే ఆధార్ కార్డు!
ఆన్లైన్లో పీవీసీ కార్డును ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకే డెలివరీ వస్తుందట.
- By Anshu Published Date - 10:30 AM, Thu - 7 November 24

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. అయితే అలాంటి ఆధార్ కార్డులో చిన్న చిన్న తప్పులు ఉంటే సరి చేసుకోవడం అన్నది తప్పనిసరి. ఇక ఆధార్ కి సంబంధించిన ఎటువంటి అప్డేట్లు అయినా సరే ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిందే. అందులో కొన్ని మొబైల్ ద్వారా ఇంటి నుంచి అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది యూఐడీఏఐ. అయితే అందులో భాగంగానే మీ ఆధార్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో పీవీసీ కార్డును ఆర్డర్ చేయవచ్చట. దీని కోసం మీరు స్పీడ్ పోస్ట్ ఖర్చుతో సహా రూ.50 మాత్రమే చెల్లించాలట.
యూఐడీఏఐ ఇప్పుడు ఆధార్ కార్డుకు సంబంధించిన పాలీ వినైల్ క్లోరైడ్ కార్డును జారీ చేస్తోంది. మరి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి? ఆ ప్రాసెస్ విధానం ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.. ఇందుకోసం ముందుగా మీరు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి తర్వాత మై ఆధార్ సెక్షన్ లో ఆర్డర్ ఆధార్ పివిసి కార్డ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీరు ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్‌పై క్లిక్ చేసిన వెంటనే, మీరు 12 అంకెల ఆధార్ నంబర్, వర్చువల్ ఐడీ లేదా ఈఐడీని పూరించాలి. తర్వాత ఆధార్ నంబర్ ను నమోదు చేసి, సెక్యూరిటీ కోడ్ ను పూరించి, దీని తర్వాత కింద ఉన్న సెండ్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి చివరగా పేమెంట్ ఆప్షన్ వస్తుంది. అక్కడ మీరు రూ.50 చెల్లించాలి. ఇక పేమెంట్ పూర్తయ్యాక మీకు ఆర్డర్ నెంబర్ మెసేజ్ వస్తుంది. అంతే పది నుంచి పదిహేను రోజుల్లో మీ ఆధార్ అడ్రస్ కు పీవీసీ కార్డు వచ్చేస్తుంది. ఇలా ఇంట్లోనే ఉండి ఎంతో సింపుల్ గా పివిసి కార్డును అప్లై చేసుకోవచ్చు.