Ind vs NZ: హైదరాబాద్ లో భారత్, కివీస్ వన్డే.. టిక్కెట్లు ఎక్కడ అమ్ముతారంటే..?
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ మ్యాచ్ అభిమానులను అలరించబోతోంది. ఈ నెల 18న భారత్ , న్యూజిలాండ్ (Ind vs NZ) మధ్య వన్డే జరగనుండగా.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. సుమారు నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్.. అంతర్జాతీయ వన్డేకు ఆతిథ్యం ఇవ్వనుంది.
- By Gopichand Published Date - 06:39 AM, Thu - 12 January 23

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ మ్యాచ్ అభిమానులను అలరించబోతోంది. ఈ నెల 18న భారత్ , న్యూజిలాండ్ (Ind vs NZ) మధ్య వన్డే జరగనుండగా.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. సుమారు నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్.. అంతర్జాతీయ వన్డేకు ఆతిథ్యం ఇవ్వనుంది. దాంతో ఈ మ్యాచ్ నిర్వహణను హెచ్‌సీఏ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
గత ఏడాది భారత్, ఆసీస్ టీ ట్వంటీ సందర్భంగా టిక్కెట్ల అమ్మకాలకు సంబంధించి తలెత్తిన వివాదంతో తొక్కిసలాట, లాఠీఛార్జ్ వంటివి చోటు చేసుకున్నాయి. దీంతో ఈ సారి టిక్కెట్లన్నీ పూర్తిగా ఆన్‌లైన్‌లో అమ్మనున్నట్లు హెచ్‌సిఎ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ప్రకటించారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న తర్వాత జనవరి 15 నుంచి గచ్చిబౌలీ, ఎల్బీ స్టేడియాలలో టిక్కెట్లు కలెక్ట్ చేసుకోవాలని సూచించారు.
Also Read: Delhi : ఢిల్లీలో దారుణం.. మహిళా క్యాబ్ డ్రైవర్‌పై బీర్ బాటిళ్లతో దాడి
జనవరి 15 నుంచి 18 వరకూ ప్రతి రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎల్బీ స్టేడియంతోపాటు గచ్చిబౌలి స్టేడియంలలో ఏర్పాటు చేసే కౌంటర్లలో ఆ టికెట్లను తీసుకోవాలని సూచించారు. బ్లాక్‌లో టికెట్ల అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అప్పటిలా కాకుండా ఈసారి టికెట్లను కేవలం ఆన్‌లైన్‌లో పేటీఎం వేదికగా మాత్రమే విక్రయిస్తామని అజారుద్దీన్ స్పష్టం చేశారు.
జనవరి 13 నుంచి 16 వరకూ ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఉప్పల్ స్టేడియం పూర్తి సామర్థ్యం 39112 కాగా 29417 టికెట్లను మాత్రమే అమ్మకానికి ఉంచనున్నారు. 13వ తేదీన 6 వేల టికెట్లు, 14న 7 వేల టికెట్లు, 15న 7 వేల టికెట్లు, 16న మిగిలిన టికెట్లను అభిమానులకు విక్రయించనున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ జట్టు జనవరి 14న హైదరాబాద్ చేసుకోనుండగా టీమిండియా మాత్రం జనవరి 16న నగరానికి రానుంది.