Srilanka Asia Cup: సూపర్ 4,లో శ్రీలంక… బంగ్లాదేశ్ ఔట్
ఆసియా కప్ లో శ్రీలంక సూపర్ 4 స్టేజ్ కు చేరింది.
- By Naresh Kumar Published Date - 12:12 AM, Fri - 2 September 22

ఆసియా కప్ లో శ్రీలంక సూపర్ 4 స్టేజ్ కు చేరింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో లంక 2 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు ముందు ఇరు జట్ల ఆటగాళ్ళ మధ్య మాటల యుద్ధం జరగడంతో మరింత ఆసక్తి పెంచింది. డూ ఆర్ డై మ్యాచ్ కావడంతో విజయం కోసం చివరి వరకూ పోరాడాయి.
మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ చెప్పినట్లుగానే రికార్డు స్కోర్‌తో లంక ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగుల భారీ స్కోర్ చేసింది. యూఏఈ గడ్డపై బంగ్లాకు ఇదే అత్యధిక స్కోర్ .
బంగ్లా జట్టులో మెహిదీ హసన్ మీర్జా 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38, అఫిఫ్ హోస్సెన్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 టాప్ స్కోరర్లుగా నిలవగా.. చివర్లో మొసాద్దేక్ హోస్సెన్ 9 బంతుల్లో 4 ఫోర్లతో 24 నాటౌట్ మెరుపులు మెరిపించాడు. లంక బౌలర్లలో హసరంగా, కరణరత్నే రెండేసి వికెట్లు తీయగా.. దిల్లాన్, మహీశ్ తీక్షణ, ఫెర్నాండో తలో వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్య చేధనలో శ్రీలంక కూడా దాటిగానే ఆడింది.ఓపెనర్లు నిస్సాక , కౌశల్ మెండీస్ తొలి వికెట్ కు 45 రన్స్ జోడించారు. మెండీస్ హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఎవ్వరూ క్రీజులో నిలువలేక పోయారు.
ఈ దశలో మెండీస్ వేగంగా ఆడి స్కోర్ పెంచాడు. దాదాపు లంక ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. అయితే చివర్లో కెప్టెన్ శనక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 33 బంతుల్లో 45 రన్స్ చేశాడు. చివరి రెండు ఓవర్లలో కాస్త ఉత్కంఠ నెలకొన్నా…శ్రీలంక పై చేయిగా నిలిచింది.