Sri Lanka Cricketer: అత్యాచార కేసులో స్టార్ క్రికెటర్ అరెస్ట్..!
శ్రీలంక స్టార్ ప్లేయర్ ధనుష్క గుణతిలకను సిడ్నీలో టీం హోటల్ నుంచి సిడ్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- Author : Gopichand
Date : 06-11-2022 - 10:55 IST
Published By : Hashtagu Telugu Desk
శ్రీలంక స్టార్ ప్లేయర్ ధనుష్క గుణతిలకను సిడ్నీలో టీం హోటల్ నుంచి సిడ్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 29 ఏళ్ల మహిళ అత్యాచార కేసులో భాగంగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై అనుమతి లేకుండా లైంగిక సంపర్కానికి పాల్పడిన కేసులో పోలీసులు నాలుగు అభియోగాలను మోపారు. దీంతో అతడు లేకుండా శ్రీలంక టీం ఆస్ట్రేలియా నుంచి తిరుగు ప్రయాణం చేస్తోందని సమాచారం.
ఆ మహిళ ఆన్‌లైన్ డేటింగ్ అప్లికేషన్ ద్వారా చాలా రోజుల పాటు అతనితో కమ్యూనికేట్ చేసిన తర్వాత అతనిని కలిసింది. నవంబర్ 2వ తేదీన బుధవారం సాయంత్రం గుణతిలక ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ విషయంపై పోలిసుల బృందం దర్యాప్తు చేస్తుందని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. గుణతిలక లంక తరపున 8 టెస్టులు, 47 వన్డేలు (ODIలు), 46 T20Iలు ఆడాడు. గుణతిలకపై ఈ తరహా ఆరోపణలు రావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ ఓ అమ్మాయి అతనిపై అత్యాచార ఆరోపణలు చేసింది. స్వదేశం(శ్రీలంక)లోనే ఒక నార్వే అమ్మాయి.. గుణతిలకతో పాటు అతని స్నేహితుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొంది. అయితే.. గుణతిలక ఆ కేసు నుంచి ఎలాగోలా బయటపడ్డాడు. జట్టులో కీలక ఆటగాడు కాబట్టి.. అతడ్ని ఆ కేసు నుంచి కాపాడుకోగలిగారు. ఆస్ట్రేలియా వ్యవహారం మాత్రం చాలా సీరియస్ అయ్యే అవకాశం ఉంది.