షాకింగ్ న్యూస్ : కోమాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
- Author : Vamsi Chowdary Korata
Date : 31-12-2025 - 12:26 IST
Published By : Hashtagu Telugu Desk
Damien Martyn : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. మెనింజైటిస్ అనేతో వ్యాధితో బాధపడుతున్న మార్టిన్.. బ్రిస్బేన్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వైద్యులు చికిత్స అందించడానికి అతడ్ని ‘ఇండ్యూస్డ్ కోమా’లోకి తీసుకెళ్లారు. కాగా, 54 ఏళ్ల డామియన్ మార్టిన్ త్వరగా కోలుకోవాలని ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రార్థనలు చేస్తున్నారు. 1999, 2003 వన్డే వరల్డ్ కప్, 2006 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో డామియన్ మార్టిన సభ్యుడు.
- ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పరిస్థితి విషమం
- కోమాలోకి తీసుకెళ్లి చికిత్స చేస్తున్న వైద్యులు
- మెనింజిటిస్‌తో బాధపడుతున్న డామియన్ మార్టిన్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్.. బ్రిస్బేన్ ఆసుపత్రిలో ప్రాణం కోసం పోరాడుతున్నాడు. 54 ఏళ్ల మార్టిన యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా జరిగిన బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ రోజు అనారోగ్యానికి గురికావడంతో.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. మెనింజైటిస్ (meningitis) అనే వ్యాధి నిర్ధరణ కావడంతో అతడికి ‘ఇండ్యూస్డ్ కోమా’ పద్ధతిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా పేషెంట్‌ను కొన్ని అనస్థీషియా డ్రగ్స్ ద్వారా తాత్కాలిక కోమాలోకి తీసుకెళ్తారు. మెదడును రక్షించడానికి ఈ విధంగా చేస్తారు.
డామియన్ మార్టిన్ ఆరోగ్య పరిస్థితిపై ఆసీస్ మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో వేదికగా స్పందిస్తున్నారు. మార్టిన్‌కు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారని.. ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలని ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ చెప్పారు. ఇక మార్టిన్ త్వరగా కోలుకోవాలని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్‌బర్గ్ కోరుకున్నారు.
ఏంటి ఈ మెనింజైటిస్
మెనింజైటిస్ అనేద మెదడు, వెన్నెముక చుట్టూ ఉండే రక్షిత పొరలకు వచ్చే తీవ్రమైన వాపు. ఇది తీవ్ర అనారోగ్యంతో సహా మరణానికి కూడా దారి తీయవచ్చు. దీంతో బ్రెయిన్ యాక్టివిటీని నెమ్మది చేయడానికి అనస్థీషియా డ్రగ్స్‌తో.. రోగిని నియంత్రిత తాత్కాలిక కోమాలోకి తీసుకెళ్తారు. తద్వారా మొదడుకు విశ్రాంతి లభించి.. వాపు తగ్గుతుంది. దీన్నే మెడికల్లీ ఇండ్యూస్డ్ కోమా అని కూడా అంటారు. కాగా, మార్టిన్‌ను వైద్యులు కోమా నుంచి బయటకు తీసుకురావచ్చని శ్రేయేభిలాషులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయిన డామియన్ మార్టిన్ ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరపున 67 టెస్టులు, 208 వన్డేలు ఆడాడు. 1999, 2003 వన్డే వరల్డ్ కప్‌వు, 2006 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో మార్టిన్ సభ్యుడు. 1992 నుంచి 2006 మధ్య కాలంలో ఆస్ట్రేలియా తరపున డామియన్ మార్టిన్ 67 టెస్టులు ఆడాడు. 2000 సంవత్సరంలో ఆరేళ్ల గ్యాప్ తర్వాత అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకున్నారు.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా నేతృత్వంలో డామియన్ మార్టిన్ కీలక బ్యాటర్‌గా కొనసాగాడు. 2006 యాషెస్ సిరీస్ మధ్యలో అతను అకస్మాత్తుగా రిటైర్ కావడం గమనార్హం. కాగా, టెస్టుల్లో మార్టిన్ 46 సగటుతో 4,406 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో మార్టిన్ 40 సగటుతో 5,346 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి.