Seniors Retirement: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత టెస్టులకు సీనియర్లు గుడ్ బై
2012-13లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ మరియు వివిఎస్ లక్ష్మణ్ వంటి సీనియర్ ఆటగాళ్ళు ఒక్కొక్కరుగా రిటైర్ అయ్యారు.
- By Naresh Kumar Published Date - 02:30 PM, Fri - 20 December 24

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత (Border Gavaskar Trophy) టీమిండియాలో భారీ మార్పులు చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అవ్వాలని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరకపోతే సీనియర్ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్నారట. నిజానికి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత వచ్చే ఏడాది జూన్-జూలైలో టీమిండియా వరుస టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో సీనియర్లు ఉండటం అసాధ్యంగానే కనిపిస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టెస్టులకు వీడ్కోలు పలికే అవకాశం ఉందంటున్నారు.
2012-13లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ మరియు వివిఎస్ లక్ష్మణ్ వంటి సీనియర్ ఆటగాళ్ళు ఒక్కొక్కరుగా రిటైర్ అయ్యారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు జట్టులో భాగమయ్యారు. సో ఇప్పుడు రోహిత్, కోహ్లీ, జడేజా లాంటి సీనియర్లు పక్కకు తెప్పుకుంటే యువకులు జట్టులోకి రానున్నారు. వాషింగ్టన్ సుందర్‌ని జట్టులోకి తీసుకోవడంతోనే అశ్విన్ రీటైర్మెంట్ ప్రకటించాడన్న వాదనలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో సీనియర్లకు ఇక టెస్టు దారులు మూసుకుపోయాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఆస్ట్రేలియా పర్యటన తర్వాత 37 ఏళ్ల కెప్టెన్ రోహిత్ శర్మ, 36 ఏళ్ల విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు రీటైర్మెంట్ ప్రకటించే అవకాశముంది. ఈ ఏడాది ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఈ ముగ్గురు ఆటగాళ్లు ఇప్పటికే టీ20 నుంచి రిటైరయ్యారు. టెస్టుల్లో రోహిత్ శర్మ బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విరాట్ ప్లాప్ అయ్యాడు. ఇక ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఉండాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సిన టైమొచ్చింది. బ్రిస్బేన్ టెస్టులో జడ్డూ 77 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ యువకుల కోసం తాను రీటైర్మెంట్ ప్రకటించక తప్పదు.