IPL 2022 : మహారాష్ట్రలో ఐపీఎల్ 2022 ?
దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతుండడంతో పలు రాష్ట్రాలు ఆంక్షల వలయంలోకి వెళ్ళిపోయాయి. నైట్ కర్ఫ్యూ , వీకెండ్ కర్ఫ్యూ. వంటి నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ సీజన్ భారత్ లో జరుగుతుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది.
- By Hashtag U Published Date - 12:06 PM, Tue - 11 January 22

దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతుండడంతో పలు రాష్ట్రాలు ఆంక్షల వలయంలోకి వెళ్ళిపోయాయి. నైట్ కర్ఫ్యూ , వీకెండ్ కర్ఫ్యూ. వంటి నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ సీజన్ భారత్ లో జరుగుతుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. కరోనా కారణంగానే గత రెండేళ్ళూ విదేశాల్లో నిర్వహించిన బీసీసీఐ ఈ సారి మాత్రం స్వదేశంలోనే లీగ్ జరిపించాలని పట్టుదలగా ఉంది. దీని కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. కోవిడ్ కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ఒకే చోట ఐపీఎల్ మ్యాచ్ లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మహారాష్ట్రనే మంచి వేదికగా భావిస్తున్న బోర్డు ఇప్పటికే అక్కడి అసోసియేషన్లతో మాట్లాడింది. ఎంసిఎతో మాట్లాడిన బీసీసీఐ అధికారులు ఎన్సీపీ నేత శరద్ పొవార్ తోనూ చర్చించారు.
వచ్చే వారం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేను కూడా కలిసి ఈ ప్రతిపాదన గురించి చెప్పనున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ఈ సారి ఐపీఎల్ పూర్తి సీజన్ కు మహారాష్ట్ర వేదికవుతుంది. ముంబైలోని వాంఖేడే, బ్రౌబర్న్ , డివై పాటిల్ స్టేడియాలతో పాటు పుణేలోని ఎంసీఎ స్టేడియంలో మ్యాచ్ ల నిర్వహణకు ప్రణాళికలు రచిస్తోంది. ఒకే రాష్ట్రంలో నిర్వహిస్తే బయోబబూల్ ను ఏర్పాటు చేయడం సులభతరం అవుతుందనేది బోర్డు ఆలోచన. అలాగే ప్రేక్షకులు లేకుండానే టోర్నీ నిర్వహించే పరిస్థితి ఉండడంతో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తవని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై త్వరలోనే పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అయితే ఏప్రిల్ సమయానికి కరోనా కేసులు తగ్గుముఖం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ళ మెగా వేలం ముగిసిన తర్వాత ఐపీఎల్ వేదిక, షెడ్యూల్ వంటి వాటిపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది.