RCB Legal Battle: కర్ణాటక హైకోర్టుకు ఆర్సీబీ.. కోర్టు ఏం చెప్పిందంటే?
న్యాయమూర్తి ఎస్.ఆర్. కృష్ణ కుమార్ రాయల్ చాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్, DNA ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారణను వాయిదా వేశారు.
- By Gopichand Published Date - 09:59 PM, Mon - 9 June 25

RCB Legal Battle: బెంగళూరు తొక్కిసలాట కేసులో (RCB Legal Battle) 11 మంది మరణించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుపై FIR నమోదైంది. కానీ ఇటీవల RCB జట్టు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. RCB ఫ్రాంచైజీకి యాజమాన్య హక్కులు కలిగిన రాయల్ చాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్ సంస్థ తమపై నమోదైన FIRని రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడు హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణను బుధవారం వరకు వాయిదా వేసింది.
న్యాయమూర్తి ఎస్.ఆర్. కృష్ణ కుమార్ రాయల్ చాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్, DNA ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారణను వాయిదా వేశారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి పిటిషన్‌లపై అభ్యంతరాలు నమోదు చేసేందుకు సమయం ఇవ్వడానికి కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, రెండు కంపెనీల (RCB, DNA) న్యాయవాదుల మధ్య ఒక ఒప్పందాన్ని హైలైట్ చేసింది. దీని ప్రకారం రాబోయే బుధవారం వరకు రాయల్ చాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్, DNA నెట్‌వర్క్స్ లిమిటెడ్ కంపెనీల ఏ అధికారిని లేదా ఉద్యోగిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేయరు. అదే సమయంలో బుధవారం వరకు ఈ రెండు కంపెనీల అధికారులు దేశం విడిచి వెళ్లకూడదు.
Also Read: Rohit Sharma: వన్డేలకు రోహిత్ శర్మ రిటైర్మెంట్.. వెలుగులోకి కీలక విషయం?!
RCB అధికారి అరెస్టు
ఈ కేసులో RCB మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలే, DNA నెట్‌వర్క్స్ వైస్-ప్రెసిడెంట్ సునీల్ మాథ్యూ జూన్ 6న అరెస్టయ్యారు. కర్ణాటక హైకోర్టు వారి బెయిల్ పిటిషన్‌పై విచారణను మంగళవారం వరకు వాయిదా వేసింది. జూన్ 3న కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన FIR ఆధారంగా నిఖిల్, సునీల్‌ను అరెస్టు చేశారు.
DNA నెట్‌వర్క్స్ పాత్ర
DNA నెట్‌వర్క్స్ కంపెనీ ఈ కేసుతో అనుసంధానం కావడానికి కారణం M చిన్నస్వామి స్టేడియంలో RCB జట్టు విజయోత్సవ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఈ ఈవెంట్‌ను ఈ కంపెనీ నిర్వహించింది. అయితే బెంగళూరు పోలీసుల అనుమతి లేకుండానే సోషల్ మీడియా ద్వారా విజయ పరేడ్ కోసం అభిమానులను ఆహ్వానించారని పోలీసులు చెబుతున్నారు.