IPL 2022 : శ్రేయస్ అయ్యర్ పై ఫ్రాంచైజీల కన్ను
ఐపీఎల్-2022 సీజన్ మెగా వేలానికి సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ రిటైన్ ఆటగాళ్ళ జాబితాను ప్రకటించేయగా... కొత్త ఫ్రాంఛైజీలు సైతం ముగ్గురు ఆటగాళ్ళ జాబితాను వెల్లడించాయి.
- By Hashtag U Published Date - 12:37 PM, Wed - 19 January 22

ఐపీఎల్-2022 సీజన్ మెగా వేలానికి సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ రిటైన్ ఆటగాళ్ళ జాబితాను ప్రకటించేయగా… కొత్త ఫ్రాంఛైజీలు సైతం ముగ్గురు ఆటగాళ్ళ జాబితాను వెల్లడించాయి. దీంతో ఫిభ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా జరగబోయే మెగా వేలంపైనే అందరి దృష్టీ నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురు స్టార్ ప్లేయర్స్ కోసం కోట్లు వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. వీరిలో శ్రేయాస్ అయ్యర్ పై కొన్ని ఫ్రాంచైజీలు కన్నేసినట్టు సమాచారం. గత సీజన్ వరకూ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్ ను ప్రాతినిథ్యం వహించాడు. అయితే శ్రేయస్ అయ్యర్‌ను ఢిల్లీ రీటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో రానున్న మెగా వేలంలో శ్రేయస్ దక్కించుకోవడానికి చాలా ఫ్రాంచైజీలు పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఐపీఎల్‌లోకి కొత్తగా రాబోతున్న లక్నో జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఎంపికైనట్లు తెలుస్తుండగా… అహ్మదాబాద్ ఫ్రాంచైజీ శ్రేయస్ అయ్యర్‌ను కాకుండా హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా ఎంపిక చేసుకుంది. దీంతో శ్రేయస్ అయ్యర్ మెగా వేలంలోకి రావడం ఖాయమైంది.
అయ్యర్ గాయంతో దూరమైనప్పుడు ఢిల్లీ జట్టు పగ్గాలను పంత్ అందుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ కోలుకుని తిరిగి వచ్చినప్పటకీ ఆ ఫ్రాంచైజీ మాత్రం పంత్ నే సారథిగా కొనసాగించింది. ఈ విషయంలో కాస్త నొచ్చుకున్న అయ్యర్ వేలంలోకి వెళ్ళాలనే నిర్ణయించుకున్నాడు. అయితే కొత్త ఫ్రాంచైజీలు అయ్యర్ ను తీసుకోకపోవడంతో వేలంలోకి వచ్చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్ ముంగిట ఆర్సీబీ, కేకేఆర్, పంజాబ్ కింగ్స్.. కొత్త కెప్టెన్ కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో ఈ మూడు జట్లలో ఏదో ఒకటి కచ్చితంగా శ్రేయస్ అయ్యర్ ను కొనుగోలు చేసి కెప్టెన్సీ అప్పగించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే శ్రేయస్ భారీ ధర పలికే ఛాన్స్ ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు ఐపీఎల్ ద్వారా శ్రేయస్ అయ్యర్ 35.8 కోట్లు అందుకున్నాడు. మొత్తం 7 ఐపీఎల్ సీజన్లు ఆడిన శ్రేయస్ అయ్యర్ 87 మ్యాచ్‌ల్లో 2375 పరుగులు చేశాడు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ సారి వేలంలో ఈ ఆటగాడు భారీ ధర పలికే అవకాశముంది.