Ind Vs Bang: రాణించిన పంత్, శ్రేయాస్.. భారత్‌కు ఆధిక్యం
భారత్,బంగ్లాదేశ్ రెండో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. రెండోరోజు ఆటలో తడబడి నిలబడిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యాన్ని అందుకుంది.
- Author : Naresh Kumar
Date : 23-12-2022 - 10:58 IST
Published By : Hashtagu Telugu Desk
భారత్,బంగ్లాదేశ్ రెండో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. రెండోరోజు ఆటలో తడబడి నిలబడిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యాన్ని అందుకుంది. నిజానికి రెండోరోజు భారీ స్కోర్ లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ టాపార్డర్ నిరాశపరిచింది. గిల్ 20, పుజారా 24, కోహ్లీ 24 పరుగులకే ఔటయ్యారు. దీంతో 94 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఆదుకున్నారు. పిచ్‌ను అర్థం చేసుకున్న వీరు బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వరుస పెట్టి బౌండరీలు, సిక్సర్లు కొడుతు స్టేడియాన్ని హోరెత్తించారు. ముఖ్యంగా పంత్.. దూకుడుగా ఆడాడు.
వీరిద్దరూ ఐదో వికెట్‌కు 159 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పారు. దూకుడుగా ఆడిన పంత్ 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 93 , శ్రేయాస్ 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 రన్స్ చేశారు. వీరిద్దరూ ఔటైన తర్వాత భారత్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతోసమయం పట్టలేదు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 314 రన్స్‌కు ఆలౌటైంది. టీమిండియాకు 87 పరుగుల ఆధిక్యం దక్కింది. బంగ్లా బౌలర్లలో షకీబుల్ 4, తైజుల్ ఇస్లాం 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ వికెట్ కోల్పోకుండా 7 పరుగులు చేసింది. ఓపెనర్లు జాకీర్ హసన్, శాంటో క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ ఇంకా 80 పరుగులు వెనుకబడి ఉంది. మ్యాచ్ ఇంకా 3 రోజుల ఆట మిగిలి ఉంది. మూడోరోజు ఎంత త్వరగా బంగ్లాను ఆలౌట్ చేస్తారనే దానిపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. కాగా తొలి టెస్టులో 188 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో టెస్ట్ కూడా గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో భారత్ మరింత ముందంజ వేస్తుంది.