ICC : భారత క్రికెటర్లకు షాకిచ్చిన ఐసీసీ
- By Hashtag U Published Date - 12:49 PM, Thu - 20 January 22

వరల్డ్ క్రికెట్ లో ఎక్కువ క్రేజ్ ఉన్న ఆటగాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది భారత క్రికెటర్లే అంటారు. ఫార్మేట్ ఏదైనా జెంటిల్మెన్ గేమ్ లో మన హవాకు తిరుగులేదు. ఎప్పటికప్పుడు ఐసీసీ అవార్డులు, ఐసీసీ టోర్నీల్లో అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన జట్టు.. ఇలా దాదాపు ప్రతీ అంశంలోనూ మన ప్రాతినిథ్యం ఉండకుండా ఉండదు. అయితే తాజాగా ఐసీసీ భారత క్రికెటర్లకు షాకిచ్చింది. 2021 సంవత్సరానికి గానూ ప్రకటించిన అత్యుత్తమ టీ ట్వంటీ జట్టులో ప్రకటించింది. అయితే ఇందులో ఒక్క భారత ఆటగాడికి కూడా చోటు కల్పించకపోవడం ఆశ్చర్యపరిచింది. 2021 అత్యుత్తమ టీ20 జట్టులో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా నుంచి ముగ్గురు , ఆస్ట్రేలియా తరపున ఇద్దరు, ఇంగ్లండ్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల నుంచి ఒక్కో ఆటగాడు చోటు దక్కించుకున్నారు.
ఈ జట్టు కెప్టెన్ గా పాకిస్థాన్ సారథి బాబర్ అజామ్‌ను ఎంపిక చేసింది. ఈ జట్టులో బాబర్‌తో పాటు పాకిస్థాన్ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్, ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది కూడా ఉన్నారు. అలాగే సౌతాఫ్రికా ప్లేయర్ఐ మక్రరమ్, డేవిడ్ మిల్లర్, తబ్రేజ్ షమ్సీ కూడా ఈ జట్టులో చొటు దక్కించుకున్నారు. ఇక ఆస్ట్రేలియా నుంచి మిచెల్ మార్ష్, హ్యాజిల్ వుడ్ లకు ఐసీసీ చోటు కల్పించింది. దీంతో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన ముస్తాఫిజుర్ రెహమాన్, శ్రీలంకకు చెందిన వనిందు హసరంగా, ఇంగ్లండ్‌కు చెందిన తుఫాన్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ ఈ జట్టులో ఉన్నారు.
ఇదిలా ఉంటే మహిళల జట్టులో మాత్రం ఒకే ఒక భారత క్రికెటర్ కు చోటు దక్కింది. 2021 మహిళల అత్యుత్తమ టీ ట్వంటీ జట్టులో స్టార్ క్రికెటర్ స్మృతి మంథనా ఎంపికైంది. గత ఏడాది మంథనా 9 టీ మ్యాచ్ లలో 255 పరుగులు చేసింది. ఐసీసీ మహిళల టీ ట్వంటీ జట్టుకు ఇంగ్లాండ్ క్రికెటర్ నటాలీ సీవర్ సారథిగా ఎంపికైంది. కాగా ఐసీసీ అత్యుత్తమ జట్టులో భారత క్రికెటర్లకు చోటు దక్కకపోవడంపై మన అభిమానులు మండిపడుతున్నారు.