Nathan Barnwell: క్రిస్ వోక్స్ ప్లేస్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాడు ఎవరో తెలుసా?
ఆండర్సన్- టెండూల్కర్ ట్రోఫీ 2025లో గాయాలు, ఆటగాళ్లపై అధిక పనిభారం రెండు జట్లను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ జట్టుకు ఈ సమస్య తీవ్రంగా మారింది.
- Author : Gopichand
Date : 02-08-2025 - 7:06 IST
Published By : Hashtagu Telugu Desk
Nathan Barnwell: ఆండర్సన్- టెండూల్కర్ ట్రోఫీ 2025లో గాయాలు, ఆటగాళ్లపై అధిక పనిభారం రెండు జట్లను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ జట్టుకు ఈ సమస్య తీవ్రంగా మారింది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో జరుగుతున్న చివరి టెస్ట్ మూడవ రోజు ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ జట్టులో లేని నాథన్ బార్న్‌వెల్ అనే ఆటగాడు ఫీల్డింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
నాథన్ బార్న్‌వెల్ ఎవరు?
మూడవ రోజు ఆటలో భారత బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతున్న సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ ఒలీ పోప్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను కలవడానికి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్ళాడు. ఆ సమయంలో ఇంగ్లీష్ జట్టులో ఫీల్డర్ల కొరత ఏర్పడింది. దీంతో సర్రే జట్టు తరపున ఆడే యువ ఆల్‌రౌండర్ నాథన్ బార్న్‌వెల్ (Nathan Barnwell) ఫీల్డింగ్‌కు దిగాడు.
బార్న్‌వెల్ ప్రస్తుతం కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సర్రే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 22 ఏళ్ల ఈ ఆటగాడు ఇప్పటివరకు ఒక ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడి, 22 పరుగులు చేసి ఒక వికెట్ తీసుకున్నాడు. అలాగే 8 లిస్ట్ ఎ మ్యాచ్‌లలో 88 పరుగులు, 2 వికెట్లు సాధించాడు. ఓవల్ మైదానం సర్రే జట్టుకు సొంత మైదానం కావడంతో బార్న్‌వెల్ అక్కడే అందుబాటులో ఉన్నాడు.
Also Read: Omega fats : నాన్ వెజ్ తినని వారికి శుభవార్త.. ఒమెగా కొవ్వులు వీటిలోనూ పుష్కలంగా దొరుకుతాయంట
గాయాల బెడదతో ఇంగ్లండ్ సతమతం
ఇప్పటికే క్రిస్ వోక్స్ గాయం కారణంగా మైదానం వీడగా బెన్ స్టోక్స్ గాయం వల్ల జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ ఒలీ పోప్ కూడా బయటకు వెళ్లడంతో ఇంగ్లండ్‌కు ఫీల్డర్ల కొరత ఏర్పడి బార్న్‌వెల్ సేవలను ఉపయోగించుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన ఇంగ్లండ్ జట్టు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందో స్పష్టం చేస్తుంది. మరో ఆటగాడు గాయపడకుండా ఉండాలని ఇంగ్లాండ్ ఇప్పుడు ప్రార్థిస్తోంది.