SKY Replaced: సూర్యకుమార్ స్థానంలో ఆకాశ్ మాద్వాల్
ఈ ఐపీఎల్ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో ముంబయి ఇండియన్స్ జట్టు ప్లేఆఫ్స్ నుంచి ముందుగానే అర్హత కోల్పోయింది.
- Author : Naresh Kumar
Date : 17-05-2022 - 9:40 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ ఐపీఎల్ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో ముంబయి ఇండియన్స్ జట్టు ప్లేఆఫ్స్ నుంచి ముందుగానే అర్హత కోల్పోయింది. రోహిత్ శర్మ సారథ్యంలో కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించిన ఈ జట్టు పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో నిలిచింది. అయితే మరో రెండో లీగ్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉండగా.. ముంబయికి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ ప్లేయర్స్ చివరి రెండు మ్యాచ్‌ల్లో అడించనుంది.
సూర్య కుమార్ యాదవ్ స్థానంలో 28 ఏళ్ల ఆకాశ్ మాధ్వాల్‌కు అవకాశం కల్పించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ ఫాస్ట్‌బౌలర్‌ను రూ.20 లక్షల ధరకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు 15 టీ20 మ్యాచ్‌లాడిన ఆకాశ్.. 20 వికెట్లు తీశాడు. సూర్యకుమార్ యాదవ్ ఎడమ మోచేతికి కండరాల గాయమవడంతో సీజన్ మొత్తానికి దూరం కానుండటంతో అతడి స్థానంలో ఆకాశ్‌ను భర్తీ చేయనున్నట్లు ముంబయి జట్టు ప్రకటించింది.
ఆకాశ్ మధ్వాల్ 2019లో కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆకాశ్ తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రాన్ని ముంబయి ఇండియన్స్ మాజీ ఆటగాడు ఉన్ముక్త్ చంద్ సారథ్యంలో ఆడాడు. ఫిబ్రవరిలో నిర్వహించిన మెగావేలంలో ఆకాశ్‌ను ఎవరు కొనుగోలు చేయలేదు. బయోబబుల్‌లో నెట్ బౌలర్‌గా అతడిని ముంబయి తీసుకుంది.