BCCI అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ పేరు ప్రచారం – సర్ప్రైజ్ ఎంట్రీ!
ఢిల్లీకి చెందిన మిథున్ మన్హాస్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన కెరీర్ గడిపారు. 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో మాత్రం అవకాశం రాలేదు.
- By Dinesh Akula Published Date - 10:39 AM, Sun - 21 September 25

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. ఇప్పటివరకు దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, హర్భజన్ సింగ్ పేర్లు ప్రచారంలో ఉండగా, తాజాగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ మిథున్ మన్హాస్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో బ్యాటింగ్ చేసిన మిథున్ ఈ పదవికి ప్రధాన అభ్యర్థిగా అవతరించనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఢిల్లీకి చెందిన మిథున్ మన్హాస్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన కెరీర్ గడిపారు. 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో మాత్రం అవకాశం రాలేదు. అయితే, క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఆటగాడిగా, కోచ్‌గా, నిర్వాహకుడిగా అనేక పాత్రలు పోషించారు. ఇటీవల జమ్మూ-కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించిన మిథున్ BCCI వార్షిక సమావేశాల్లో కూడా చురుకుగా పాల్గొన్నారు.
శనివారం ఢిల్లీలో ఒక కేంద్ర మంత్రి నివాసంలో నిర్వహించిన అనధికారిక సమావేశంలో మిథున్ మన్హాస్ పేరు పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సమతుల్య నాయకత్వం, పాలనా అనుభవం, రాష్ట్ర సంఘాల మధ్య సఖ్యతను పటిష్టం చేయగల సమన్వయ నాయకుడు అవసరమనే అభిప్రాయంతో మిథున్ అభ్యర్థిత్వానికి మెజారిటీ మద్దతు వచ్చినట్లు సమాచారం.
బోర్డు వర్గాల నివేదికల ప్రకారం, సెప్టెంబర్ 28న జరిగే BCCI వార్షిక సాధారణ సమావేశం (AGM) తర్వాత అధికారికంగా కొత్త అధ్యక్షుని పేరు ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే, మిథున్ మన్హాస్ BCCI చరిత్రలో అంతర్జాతీయ క్రికెట్ ఆడని తొలి అధ్యక్షుడిగా నిలిచే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో బీసీసీ అధ్యక్ష పదవికి మిథున్ ఎంపిక తథ్యమైతే, భారత క్రికెట్ పాలనలో ఇది కీలక మలుపుగా నిలవనుంది.