Hardik Pandya announces divorce : ఔను మేమిద్దరం విడిపోయాం విడాకులపై పాండ్యా ప్రకటన ..!
సెర్బియాకు చెందిన మోడల్, నటి అయిన నటాషా (Natasa)ను హార్థిక్ ప్రేమించి 2020లో పెళ్ళి చేసుకున్నాడు. అదే ఏడాది ఈ జంటకు అగస్త్య పుట్టాడు.
- By Ramesh Published Date - 10:20 PM, Thu - 18 July 24

టీమిండియా స్టార్ క్రికెటర్ హార్థిక్ పాండ్యా (Hardik Pandya) కీలక ప్రకటన చేశాడు. భార్య నటాషాతో విడిపోయినట్టు ప్రకటించాడు. టీ ట్వంటీ కెప్టెన్సీ సూర్యకుమార్ యాదవ్ కు అప్పగించిన గంట వ్యవధిలోనే తన విడాకులపై పాండ్యా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. నటాషాతో విడిపోతున్నానని, ఇది చాలా కఠిన నిర్ణయంగా పేర్కొన్నాడు. ఇద్దరం అగస్త్యకు మంచి కో పేరెంట్స్ గా ఉంటామని, ప్రస్తుత పరిస్థితుల్లో తమ ప్రైవసీని గౌరవించాలని కోరాడు. సెర్బియాకు చెందిన మోడల్, నటి అయిన నటాషా (Natasa)ను హార్థిక్ ప్రేమించి 2020లో పెళ్ళి చేసుకున్నాడు. అదే ఏడాది ఈ జంటకు అగస్త్య పుట్టాడు. నిజానికి గత కొంత కాలంగా నటాషా, హార్థిక్ విడాకులపై వార్తలు వస్తున్నాయి.
గత ఏడాది చివర్లో వీరిద్దరి మధ్య మనస్పర్థలు మొదలైనట్టు తెలుస్తోంది. కారణాలు తెలియకున్నా తర్వాత జరిగిన పరిణామాలు పాండ్యా విడాకుల వార్తలకు బలం చేకూర్చాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, వ్యక్తిగత ఫోటోలు విడివిడిగా పోస్ట్ చేస్తుండడంతో అనుమానాలు మొదలయ్యాయి.
ఐపీఎల్ 17వ సీజన్ లో ముంబై కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న పాండ్యా జట్టును విజయాల బాటలో నడిపించలేకపోవడంతో తీవ్ర ట్రోలింగ్ కు గురయ్యాడు. ఈ టైమ్ లోనూ నటాషా స్పందించలేదు. గతంలో స్టేడియానికి వచ్చి సందడి చేసిన ఆమె 17వ సీజన్ లో కనిపించకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు చాలామంది తేల్చేశారు. ఒకానొక దశలో పాండ్యా తన విడాకుల కారణంగా ఆస్తిలో 70 శాతం ఆస్తులు కోల్పోతున్నట్టు కూడా చర్చ జరిగింది. దీనిపై ఓ టీవీ షోలో పాండ్యా స్పందించాడు.
తన ఆస్తులు సగానికి పైగా తల్లి పేరిటే ఉన్నాయని క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ (T20 Worldcup) గెలిచిన తర్వాత నటాషా హార్థిక్ ను విష్ చేయకపోవడంతో విడాకులు తీసుకున్నట్టు తేలిపోయింది. దీనికి తోడు ఇటీవలే నటాషా కొడుకు అగస్త్యను తీసుకుని సెర్బియా వెళ్ళిపోయింది. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో హార్థిక్ విడాకుల ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా టీ ట్వంటీ కెప్టెన్సీ చేజారిన కొద్ది సమయంలోనే పాండ్యా తన విడాకుల (Hardik Pandya divorce) విషయాన్ని అభిమానులకు ఇన్ స్టా ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం కష్టసమయంలో ఉన్న హార్థిక్ పాండ్యాకు అభిమానులు అండగా నిలుస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే అతను వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించాడని, ఈ కష్ట సమయాన్ని హార్థిక్ అధిగమిస్తాడంటూ ధైర్యం చెబుతున్నారు.