Border Gavaskar Trophy: కామెరాన్ గ్రీన్ గాయపడటంతో భారత్ కు భారీ ఉపశమనం
Border Gavaskar Trophy: ఆస్ట్రేలియా వెటరన్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ గాయపడ్డాడు. భారత్‌తో జరిగే 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు కూడా గ్రీన్ దూరం కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే కంగారూ జట్టుకు ఇది పెద్ద దెబ్బే.
- By Praveen Aluthuru Published Date - 01:11 PM, Sat - 28 September 24

Border Gavaskar Trophy: భారత్ ఆస్ట్రేలియా మధ్య 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ వరుస సిరీస్ లు ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది జనవరి మధ్య జరుగుతాయి. ఈ సిరీస్ కోసం ఇరు దేశాల ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరు దేశాల మధ్య చిన్న సిరీస్ జరిగినా ఉత్కంఠగా సాగుతుంది. అలాంటిది ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ అంటే ఇంకెంత మజాను అందిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆసీస్ తో టెస్ట్ అంటే కోహ్లీ మెంటల్ పుట్టిస్తాడు. వికెట్ పడినా, క్యాచ్ అందుకున్నా కోహ్లీ సెలెబ్రేషన్స్ ఉరమాస్ లెవెల్ లో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియన్ క్రికెట్ ఫ్యాన్స్ సైతం ఇండియాతో టెస్ట్ సిరీస్ అంటే చాలా ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా ఈ సిరీస్ ఇరు దేశాలకు చాలా కీలకమని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్ లో గెలవడం తప్పనిసరి. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. నివేదికల ప్రకారం ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా వెటరన్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green) గాయపడ్డాడు. భారత్‌తో జరిగే 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు కూడా గ్రీన్ దూరం కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే కంగారూ జట్టుకు ఇది పెద్ద దెబ్బే.
గ్రీన్ ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అతను ప్లేయింగ్ ఎలివేన్లో లేకపోవడం జట్టుకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది.25 ఏళ్ల కామెరాన్ గ్రీన్ 2020లో అరంగేట్రం చేసినప్పటి నుంచి 28 టెస్టులు ఆడాడు. 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీల సాయంతో 1377 పరుగులు చేశాడు. 35 వికెట్లు కూడా తీశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఫాస్ట్ బౌలింగ్ మరియు ఆల్ రౌండర్ ఎవరూ లేరు. అందువల్ల గ్రీన్ లేకపోవడం ఆస్ట్రేలియాకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. ఇకపోతే బోర్డర్ గవాస్కర్ సిరీస్ (Border Gavaskar Trophy)నుంచి కామెరాన్ గ్రీన్ ఔట్ కావడం భారత్‌కు శుభవార్త లాంటిది. భారత్ తో మ్యాచ్ అంటే గ్రీన్ ఓ రేంజ్ లో చెలరేగిపోతాడు. ఐపీఎల్‌లో ఆడటం వల్ల భారత ఆటగాళ్ల బలహీనతలు కూడా అతనికి బాగా తెలుసు. అందువల్ల టెస్టు సిరీస్‌లో అతడు టీమ్‌ఇండియాకు ప్రమాదకరంగా మారవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు సిరీస్‌కు దూరమైనట్లు వార్తలు రావడం భారత్‌కు శుభపరిణామంగా చెప్పొచ్చు.
Also Read: Realme p2 pro 5G: మార్కెట్ లోకి విడుదలైన మరో రియల్ మీ 5జీ స్మార్ట్ ఫోన్.. ప్రత్యేకతలు ఇవే!