Paris Olympics : భారత్ బోణీ..తొలి పతకం అందించిన మను బాకర్
రెండుసార్లు మను బాకర్ కొరియన్ షూటర్ ను వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్ లో నిలిచినా చివరి వరకూ దానిని నిలుపుకోలేకపోయింది
- By Sudheer Published Date - 04:54 PM, Sun - 28 July 24

పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో భారత్ (India) పతకాల ఖాతా తెరిచింది. రెండోరోజు షూటింగ్ లో మన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (10m air pistol final) ఈవెంట్ లో యువ షూటర్ మను బాకర్ (Manu Bhaker) అదరగొట్టింది. మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. అయితే ఫైనల్ పోటీలు చివరి షాట్ వరకూ ఉత్కంఠభరితంగా సాగాయి. ముఖ్యంగా తొలి నాలుగు స్థానాల్లో ఫలితాలు మారుతూ రావడంతో మెడల్ వస్తుందా రాదా అన్న టెన్షన్ పెరిగిపోయింది. తొలి రెండు స్థానాల్లో కొరియన్ షూటర్లే ఆద్యంతం ఆధిపత్యం కనబరిచారు. మధ్యలో రెండుసార్లు మను బాకర్ కొరియన్ షూటర్ ను వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్ లో నిలిచినా చివరి వరకూ దానిని నిలుపుకోలేకపోయింది. చివరి షాట్ లో కూడా రజతం గెలిచే ఛాన్స్ వచ్చినప్పటకీ… కేవలం 0.1 పాయింట్ తేడాతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫైనల్లో మను బాకర్ 221.7 పాయింట్లు స్కోర్ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
అయితే ఒలింపిక్స్ మహిళల షూటింగ్ లో భారత్ కు పతకం రావడం ఇదే తొలిసారి. దీంతో ఈ ఘనత సాధించిన తొలి మహిళా షూటర్ గా మను బాకర్ రికార్డు సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్ లో అంచనాలు అందుకోలేకపోవడంతో అప్పట్లో తీవ్ర నిరాశకు గురైన మను గత రెండేళ్ళుగా మంచి ఫలితాలు సాధించింది. ఒలింపిక్ మెడల్ గెలవడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేసింది. హర్యానాకు చెందిన మను ఐఎస్ఎస్ఎఫ్ 2018 వరల్డ్ కప్ లో గోల్డ్ మెడల్ గెలిచిన యంగెస్ట్ షూటర్ గా రికార్డు సాధించింది. అలాగే కామన్ వెల్త్ గేమ్స్ , ఆసియాక్రీడల్లో ఆమె స్వర్ణాలు సాధించింది. రజతాన్ని తృటిలో చేజార్చుకోవడం కాస్త నిరాశకు గురిచేసినా ఓవరాల్ గా దేశానికి ఒలింపిక్ మెడల్ అందించడం గర్వంగా ఉందని మను బాకర్ చెప్పింది.
Read Also : Brake Disc Wiping: కార్లలో బ్రేక్ డిస్క్ వైపింగ్ సిస్టమ్.. ఇది ఎలా పని చేస్తుందంటే..?