Lionel Messi: 2026 ప్రపంచ కప్ తర్వాత ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్పనున్న మెస్సీ?!
సెప్టెంబర్ 4న జరిగే మ్యాచ్ నిజంగా మెస్సీకి చివరి స్వదేశీ క్వాలిఫైయర్ అయితే అది అర్జెంటీనా ఫుట్‌బాల్ చరిత్రలోనే అతిపెద్ద ఎమోషనల్ క్షణాలలో ఒకటిగా మిగిలిపోతుంది.
- By Gopichand Published Date - 03:45 PM, Fri - 29 August 25

Lionel Messi: గొప్ప ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ (Lionel Messi) చేసిన ప్రకటన తన అభిమానులందరి హృదయాలను కలచివేసింది. 38 ఏళ్ల ఈ అర్జెంటీనా స్టార్ తన అంతర్జాతీయ కెరీర్ చివరి దశకు చేరుకుందని స్పష్టం చేశాడు. బ్యూనస్ ఎయిర్స్ లోని ఎస్టాడియో మోనుమెంటల్ స్టేడియంలో సెప్టెంబర్ 4న వెనిజులాతో జరిగే ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ బహుశా తన చివరి స్వదేశీ మ్యాచ్ కావచ్చునని మెస్సీ సూచించాడు.
కుటుంబంతో మైదానంలో మెస్సీ
Apple TV కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెస్సీ మాట్లాడుతూ.. “ఇది నాకు చాలా ప్రత్యేకమైన మ్యాచ్ అవుతుంది. ఇది నా చివరి క్వాలిఫైయర్ గేమ్ కావచ్చు. ఆ తర్వాత ఏమైనా స్నేహపూర్వక లేదా ఇతర మ్యాచ్‌లు ఉంటాయో లేదో నాకు తెలియదు. కానీ ఈ మ్యాచ్ కోసం నా కుటుంబం మొత్తం నాతో కలిసి ఉంటుంది. నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా సోదర సోదరీమణులు, నా భార్య బంధువులందరూ స్టేడియంలో ఉంటారు” అని చెప్పాడు.
అర్జెంటీనా ఇప్పటికే అర్హత సాధించింది
2026 ప్రపంచ కప్ కోసం అర్జెంటీనా ఇప్పటికే అర్హత సాధించింది. టీమ్ 35 పాయింట్లతో సౌత్ అమెరికన్ క్వాలిఫైయర్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ అర్జెంటీనాకు ఒక లాంఛనం మాత్రమే. కానీ మెస్సీ, అతని అభిమానులకు ఇది ఒక ఎమోషనల్ క్షణం కానుంది.
Also Read: Sachin Tendulkar : క్రీడలకు సచిన్ సలాం.. ‘ఫిట్ ఇండియా’ సందేశం, యువతకు పిలుపు..!
మెస్సీ క్వాలిఫైయర్ రికార్డ్
మెస్సీ ఇప్పటివరకు 193 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో 31 గోల్స్ సాధించాడు. 2022 ఖతర్ ప్రపంచ కప్‌లో అర్జెంటీనాను 36 ఏళ్ల తర్వాత ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టడం అతని కెరీర్‌లో అతిపెద్ద విజయం. సెప్టెంబర్ 9న ఈక్వెడార్‌తో కూడా మెస్సీ క్వాలిఫైయర్ ఆడవచ్చు. కానీ ఆ మ్యాచ్ అవే మ్యాచ్ అవుతుంది. అందువల్ల సెప్టెంబర్ 4వ తేదీ బ్యూనస్ ఎయిర్స్ అభిమానులు తమ హీరోను క్వాలిఫైయర్‌లో స్వదేశంలో ఆడుతూ చూసే చివరి రోజు కావచ్చు.
ప్రపంచ కప్ క్వాలిఫైయర్ ప్రాసెస్
సౌత్ అమెరికాలో ప్రపంచ కప్ క్వాలిఫైయర్లు CONMEBOL (సౌత్ అమెరికన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్) నియమాల ప్రకారం ఆడతారు. అర్జెంటీనా, బ్రెజిల్, ఉరుగ్వే, చిలీ, కొలంబియాతో సహా 10 జట్లు ఇందులో పాల్గొంటాయి. ప్రతి జట్టు మిగిలిన తొమ్మిది దేశాలతో హోమ్, అవే (బయట) మొత్తం 18 మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లలో టాప్-6 జట్లు నేరుగా ప్రపంచ కప్‌కు అర్హత సాధిస్తాయి. ఏడవ స్థానంలో ఉన్న జట్టు FIFA Play-Off Tournament ఆడవలసి ఉంటుంది.
అర్జెంటీనాకు ఒక శకం ముగింపు?
సెప్టెంబర్ 4న జరిగే మ్యాచ్ నిజంగా మెస్సీకి చివరి స్వదేశీ క్వాలిఫైయర్ అయితే అది అర్జెంటీనా ఫుట్‌బాల్ చరిత్రలోనే అతిపెద్ద ఎమోషనల్ క్షణాలలో ఒకటిగా మిగిలిపోతుంది. మెస్సీ ఇంకా అంతర్జాతీయ రిటైర్మెంట్ అధికారికంగా ప్రకటించనప్పటికీ అతని సూచనలు ఫుట్‌బాల్‌లో ఈ సువర్ణ అధ్యాయం ముగింపు దశకు వచ్చిందని స్పష్టం చేస్తున్నాయి.