IPL Auction 2022 : అప్పుడు 9 కోట్లు..ఇప్పుడు 90 లక్షలే
ఐపీఎల్ వేలంలో ఓడలు బండ్లు అవడం.. బండ్లు ఓడలు అవడం సాధారణమే.. భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్ళు అంచనాలు అందుకోకపోవడం చాలా సందర్భాల్లో జరిగింది.
- By Naresh Kumar Published Date - 08:52 PM, Sun - 13 February 22

ఐపీఎల్ వేలంలో ఓడలు బండ్లు అవడం.. బండ్లు ఓడలు అవడం సాధారణమే.. భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్ళు అంచనాలు అందుకోకపోవడం చాలా సందర్భాల్లో జరిగింది. ఈ ప్రభావం తర్వాతి వేలంలో ఆ ఆటగాడి ధరపై ఖచ్చితంగా చూపిస్తుంది. ఈ క్రమంలోనే అన్‌క్యాప్డ్ ప్లేయర్ కృష్ణప్ప గౌతమ్‌కు ఇలాంటి అనుభవం ఎదురైంది. తాజా వేలంలో గౌతమ్‌ను 90 లక్షలకు లక్నో సూపర్‌జెయింట్స్ కొనుగోలు చేసింది. అయితే గత సీజన్‌కు ముందు జరిగిన వేలంలో కృష్ణప్ప గౌతమ్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. ఆల్‌రౌండర్ అయిన గౌతమ్‌ను గత సీజన్‌లో చెన్నై 9.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఆల్ రౌండర్‌ను భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకున్నప్పటకీ..గత సీజన్‌లో ఈ ఆటగాడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పటి వరకూ ఐపీఎల్‌లో 24 మ్యాచ్‌లు ఆడిన కృష్ణప్ప గౌతమ్ 13 వికెట్లు తీసాడు. 14.30 సగటుతో 186 పరుగులు చేశాడు. గౌతమ్ ఇప్పటి వరకు ఐపీఎల్ మూడు సీజన్లు మాత్రమే ఆడాడు.
కాగా 2018లోనూ గౌతమ్ భారీ ధర పలికాడు. రాజస్థాన్ రాయల్స్ 6.20 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో గౌతమ్ 15 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. దీని తర్వాత గౌతమ్ 2019 సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో 1 వికెట్ ,. 2020లో 2 మ్యాచ్‌ల్లో ఒక వికెట్ తీయగలిగాడు. 2021 సీజన్‌లో అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అంటే గత మూడు సీజన్లలో, గౌతమ్ కేవలం 2 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అప్పుడు 9 కోట్లకుపైనే పెట్టిన ఫ్రాంఛైజీలు ఈసారి పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో కృష్ణప్ప.. రూ. 90 లక్షలకే లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ సొంతమయ్యాడు. రూ. 50 లక్షల బేస్‌ప్రైజ్‌కు వేలంలోకి వచ్చిన గౌతమ్ కోసం కోల్‌కతా, దిల్లీ కూడా పోటీపడినా.. లఖ్‌నవూ దక్కించుకుంది. కృష్ణప్ప గౌతమ్ టీ20ల్లో 67 మ్యాచ్‌లు ఆడి 48 వికెట్లు పడగొట్టాడు. అటు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఐపీఎల్ 2022 వేలంలో తక్కువ ధరకే అమ్ముడయ్యాడు. దీంతో నెట్టింట్లో కృష్ణప్ప గౌతమ్‌పై మీమ్స్ పేలుతున్నాయి. ఒక్కోసారి టైమ్ ఇలానే ఉంటుందని కొందరు.. పర్వాలేదు ఈ సారి ఐపీఎల్ కాంట్రాక్ట్‌తో మంచి ప్రదర్శన కనబరుస్తావ్ అంటూ మరికొందరు ధైర్యం చెబుతున్నారు.