Royal Challengers Bangalore: పదునెక్కిన బెంగళూరు బౌలింగ్.. హోంగ్రౌండ్ తోనే అసలు సమస్య
ఐపీఎల్ తొలి సీజన్ నుంచి టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంటున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఒక్కసారి కూడా కప్ కొట్టలేకపోయింది. స్టార్ ప్లేయర్స్ ఉన్నా పలుసార్లు అంచనాలు అందుకోలేక చతికిలపడుతూనే ఉంది.
- Author : Naresh Kumar
Date : 24-03-2023 - 1:11 IST
Published By : Hashtagu Telugu Desk
ఐపీఎల్ తొలి సీజన్ నుంచి టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంటున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఒక్కసారి కూడా కప్ కొట్టలేకపోయింది. స్టార్ ప్లేయర్స్ ఉన్నా పలుసార్లు అంచనాలు అందుకోలేక చతికిలపడుతూనే ఉంది. ఎప్పటిలానే ఈ సారి కూడా ఆర్ సీబీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. మినీ వేలం తర్వాత ఆ జట్టు బలం పెరిగిందనేది విశ్లేషకుల అంచనా. బెంగళూరు బౌలింగ్ ప్రతిసారీ బలంగానే ఉన్నా స్థాయికి తగినట్టు ప్రదర్శన కనబరచలేకపోతోంది. ఈ సారి వేలంలో పలువురు కీలక బౌలర్లను కొనుగోలు చేసిన ఆర్ సీబీ తన బౌలింగ్ బలాన్ని మరింత పెంచుకున్నట్టే కనిపిస్తోంది.
జోష్ హాజిల్‌వుడ్, మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ రూపంలో అద్భుతమైన బౌలర్లు ఆర్ సీబీ జట్టులో ఉన్నారు. ఇంకా పేస్ విభాగంలో కొంత సమస్యను అధిగమించేందుకు రీస్ టాప్లేను ఆ జట్టు కొనుగోలు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఈ ఇంగ్లండ్ ఎడం చేతి వాటం పేసర్ రాకతో ఆర్సీబీ పేస్ యూనిట్‌కు కొత్త బలాన్ని వచ్చినట్టేనని చెప్పొచ్చు. అయితే ఈ ఇంగ్లీష్ పేసర్ ఐపీఎల్ ఆరంభంలో కొన్ని మ్యాచులకు దూరం అవుతున్నాడు. అతని స్థానాన్ని తాజాగా కొనుగోలు చేసిన రీస్ టాప్లేతో ఆర్సీబీ భర్తీ చేయడానికి ప్రయత్నించాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు.
Also Read: Gujarat Titans: ఈ సారీ టైటిల్ మాదే.. కాన్ఫిడెంట్ గా గుజరాత్ టైటాన్స్
ఇదిలా ఉంటే విల్ జాక్స్ దూరమవడం బెంగళూరు ఎదురుదెబ్బేనని భావించినా.. రీప్లేస్ మెంట్ గా కివీస్ ఆల్ రౌండర్ బ్రేస్ వెల్ ను తీసుకోవడం కలిసొచ్చే అంశం. కాగా హిమాన్షు శర్మ, రజన్ కుమార్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్ వంటి యువ ఆటగాళ్లను వేలంలో ఆర్ సీబీ తీసుకుంది. వీరిలో సోనూ యాదవ్, అవినాష్ సింగ్ ఇద్దరూ పేస్ బౌలర్లు కావడంతో ఆసక్తి నెలకొంది. వీరి దేశవాళీ రికార్డుపై వివరాలు లేకున్నా బెంగళూరు ప్రత్యేకంగా వేలంలో తీసుకోవడంతో ఫ్యుచర్ బ్యాకప్ కోసమేనని తెలుస్తోంది. అటు స్పిన్ విభాగంలోనూ బెంగళూరు మెరుగ్గానే కనిపిస్తోంది.
ప్రధాన స్పిన్ ఆల్ రౌండర్ హసరంగాపై అంచనాలున్నాయి. అతనితో పాటు కరణ్ శర్మ, మహిపాల్ లామ్రోర్ , షాబాద్ అహ్మద్ లాంటి స్పిన్నర్లూ ఉండడంతో ఆర్ సీబీ ధీమాగానే ఉంది. అయితే ఈ సారి హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ లు జరగనున్నాయి. అక్కడ పిచ్ పూర్తిగా బ్యాటర్లకే అనుకూలంగా ఉండడంతో బౌలర్లకు కష్టాలు తప్పవు. దీంతో ఎప్పుడూ పరుగుల వరద పారే చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు బౌలింగ్ ఎటాక్ ఎలా రాణిస్తుందనే దానిపైనే ఆ జట్టు టైటిల్ గెలిచే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రధాన బౌలర్లతో పాటు యువ బౌలర్లకూ ఈ సారి చిన్నస్వామి స్టేడియం పెద్ద సవాల్ గానే చెప్పాలి.