IPL 2023 auction: మినీ వేలంలో 991 మంది క్రికెటర్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలానికి కౌంట్ డౌన్ మొదలయింది.
- By Gopichand Published Date - 06:55 AM, Fri - 2 December 22

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలానికి కౌంట్ డౌన్ మొదలయింది. డిసెంబర్ 23న కొచ్చి వేదికగా జరగనున్న వేలంలో 991 మంది ఆటగాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 714 మంది భారత క్రికెటర్లు , 277 మంది విదేశీ ఆటగాళ్ళు ఉన్నారు. 19 మంది భారత క్యాప్డ్ ప్లేయర్స్ , 166 మంది అంతర్జాతీయ ఆటగాళ్ళు, 20 మంది అసోసియేట్ దేశాలకు చెందిన ప్లేయర్స్ , గత ఐపీఎల్ సీజన్లలో ఆడిన 91 మంది ఇండియా అన్ క్యాప్డ్ ప్లేయర్స్ , 604 మంది కొత్తగా ఎంట్రీ చేసుకున్న ఇండియా అన్ క్యాప్డ్ ప్లేయర్స్ , 88 మంది విదేశీ అన్ క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు.
వేలంలో ఈ సారి ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్స్ బెన్ స్టోక్స్, జో రూట్ , సామ్ కురాన్ తో పాటు జాసన్ హోల్డర్ , గ్రీన్ , డేవిడ్ వీజ్, జోషువా లిటిల్ వంటి ప్లేయర్స్ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఫించ్ , అలెక్స్ హేల్స్, ప్యాట్ కమ్మిన్స్ , సామ్ బిల్లింగ్స్ వేలం నుంచి తప్పుకున్నారు.వేలంలో 87 మంది మాత్రమే అమ్ముడుపోనుండగా.. టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రాణించిన పలువురు విదేశీ ప్లేయర్స్ పై కాసుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా 57 మంది రిజిస్టర్ చేసుకోగా.. సౌతాఫ్రికా నుంచి 52 మంది, వెస్టిండీస్ నుంచీ 33 , ఇంగ్లాండ్ నుంచి 31 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రముఖ ఆక్షనీర్ ఎడ్మండ్స్ వేలం పాట నిర్వహిస్తారు. గత వేలం సమయంలో ఆయన అస్వస్థతకు గురైనా.. ఇప్పుడు ఎటువంటి ఇబ్బందీ లేకపోవడంతో మినీ వేలాన్ని నిర్వహిస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి.