Ind Vs WI: మూడో టీ ట్వంటీ కూడా ఆలస్యమే
లగేజ్ లేట్ భారత్ , విండీస్ టీ ట్వంటీ సీరీస్ పై గట్టిగానే పడింది.
- Author : Naresh Kumar
Date : 02-08-2022 - 5:06 IST
Published By : Hashtagu Telugu Desk
లగేజ్ లేట్ భారత్ , విండీస్ టీ ట్వంటీ సీరీస్ పై గట్టిగానే పడింది. విండీస్ బోర్డు నిర్వహణ లోపాలతో రెండో టీ ట్వంటీ వేదికకు ఆటగాళ్ళ కిట్స్, ఇతర లగేజ్ సమయానికి చేరలేదు. దీంతో రాత్రి 8 గంటలకు ఆరంభం కావలసిన మ్యాచ్ 11 గంటలకు మొదలయింది. ఇప్పుడు
సెయింట్స్ కిట్స్ వేదికగా మంగళవారం జరగాల్సిన మూడో టీ20 కూడా గంటన్నర ఆలస్యంగా ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. ఇప్పుడు 9:30 గంటలకు మొదలుకానుంది. కాగా వరుసగా రెండు మ్యాచ్‌లు జరగనుండడంతో ఆటగాళ్ల విశ్రాంతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విండీస్ క్రికెట్ తెలిపింది.సోమవారం నాటి మ్యాచ్ ఆలస్యంగా మొదలు కావడంతో మూడో టీ20కు ముందు ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి దొరికే అవకాశం కనిపించడం లేదనీ అందుకేఇరు జట్ల అంగీకారంతో మూడో మ్యాచ్‌ను గంటన్నర ఆలస్యంగా ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపింది.
ఇదిలా ఉంటే మూడు గంటల పాటు రెండో మ్యాచ్ ను ఆపినా సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, అవేశ్ ఖాన్ ల లగేజీలు అందనే లేదు. దీంతో వాళ్లు అర్ష్‌దీప్ జెర్సీ వేసుకుని బరిలోకి దిగాల్సి వచ్చింది. దీంతో విండీస్ బోర్డు నిర్వహణ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఒక్క తప్పు ప్రభావం ఇప్పుడు మరో మ్యాచ్ పై కూడా పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా
ఇప్పటికే రెండు మ్యాచులు ముగిసిన ఈ ఐదు మ్యాచుల సిరీస్ లో చెరో విజయంతో 1-1 తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో ఆధిక్యం సాధించడంతో పాటు ముందంజ వేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. సిరీస్ నెగ్గాలంటే ఈ మ్యాచ్ కీలకం కానుంది.