IND vs AUS T20 Series: ఆసీస్ తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక ఎప్పుడంటే… కీలక ఆటగాళ్లకు రెస్ట్
వన్డే ప్రపంచకప్ ఆసక్తికరంగా సాగుతోంది. అంచనాలు పెట్టుకున్న టీమిండియా అద్భుతంగా రాణిస్తు వరుస విజయాలతో సెమీస్ కు చేరింది. నెదర్లాండ్స్ తో ఆదివారం చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. అయితే ప్రపంచకప్ ముగిసిన వెంటనే భారత్ కు వరుస సిరీస్ లు ఉన్నాయి. బిజీ షెడ్యూల్ లో భాగంగా సొంతగడ్డపై ఆసీస్ తో టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది.
- By Praveen Aluthuru Published Date - 03:45 PM, Sat - 11 November 23

IND vs AUS T20 Series: వన్డే ప్రపంచకప్ ఆసక్తికరంగా సాగుతోంది. అంచనాలు పెట్టుకున్న టీమిండియా అద్భుతంగా రాణిస్తు వరుస విజయాలతో సెమీస్ కు చేరింది. నెదర్లాండ్స్ తో ఆదివారం చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. అయితే ప్రపంచకప్ ముగిసిన వెంటనే భారత్ కు వరుస సిరీస్ లు ఉన్నాయి. బిజీ షెడ్యూల్ లో భాగంగా సొంతగడ్డపై ఆసీస్ తో టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది. నవంబర్ 15న ప్రపంచకప్ సెమీఫైనల్ ముగిసిన తర్వాతే జట్టు ఎంపిక ఉంటుందని బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ సిరీస్ కు పలువురు కీలక ఆటగాళ్ళకు విశ్రాంతినివ్వనున్నారు. విశ్రాంతి లేకుండా ఏడాదిన్నర కాలంగా క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మ , కోహ్లీ, ఇంకా పలువురు సీనియర్లకు సెలక్టర్లు రెస్ట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
అలాగే గాయపడిన హార్థిక్ పాండ్యా కూడా ఆసీస్ తో టీ ట్వంటీ సిరీస్ కు అందుబాటులో ఉండడం లేదు. ఇప్పటికిప్పుడే పాండ్యాను మైదానంలోకి దింపే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న పలువురు యువ ఆటగాళ్ళకు చోటు దక్కనుంది. పాండ్యా అందుబాటులో లేని నేపథ్యంలో కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేసే అవకాశాముంది. అతనికి కూడా విశ్రాంతినిస్తే చెన్నై ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించొచ్చు. రుతురాజ్ ఇటీవల ఆసియా క్రీడల్లో భారత యువ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఇదిలా ఉంటే వెటరన్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కు సెలక్టర్లు పిలుపునిచ్చే అవకాశముందని సమాచారం. గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరమైన భువి ఇటీవల ముస్తాక్ అలీ టోర్నీలో రాణించాడు. ఆసీస్ తో సిరీస్ కు సీనియర్ బౌలర్లకు విశ్రాంతినిస్తే భువికి పిలుపు దక్కనుంది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ ట్వంటీ టోర్నీలో భువి 7 మ్యాచ్ లలో 16 వికెట్లు పడగొట్టాడు.
మరోవైపు కేరళ వికెట్ కీపర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కు చోటు దక్కనుంది. అతనితో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అదరగొట్టిన ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ కు చోటు ఖాయంగా కనిపిస్తోంది. రియాన్ పరాగ్ 10 మ్యాచ్ లలో 85 సగటుతో 510 పరుగులు చేశాడు. దీనిలో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వీరితో పాటు యశశ్వి జైశ్వాల్, తిలక్ వర్మ, రాహుల్ త్రిపాఠీ , రింకూ సింగ్, వాష్టింగ్టన్ సుందర్, చాహల్ వంటి యువ క్రికెటర్లకు పిలుపు దక్కే అవకాశముంది.
Also Read: MLC Kavitha: రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్