Ind vs England: ఇంగ్లాండ్ టార్గెట్ 378
ఊహించినట్టుగానే బర్మింగ్ హామ్ టెస్టులో టీమిండియా ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్థేశించింది.
- By Naresh Kumar Published Date - 07:42 PM, Mon - 4 July 22

ఊహించినట్టుగానే బర్మింగ్ హామ్ టెస్టులో టీమిండియా ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్థేశించింది. నాలుగోరోజు పుజారా, పంత్ రాణించడంతో రెండో ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌటైంది.
ఒక దశలో 400 పరుగులకు పైగా టార్గెట్ నిర్థేశిస్తుందని అనుకున్నప్పటరీ… నాలుగోరోజు ఇంగ్లాండ్ బౌలర్లు పుంజుకున్నారు. పుజారా 66 పరుగులకు ఔటైన తర్వాత పంత్ నిలకడగా ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 57 పరుగులు చేసిన పంత్ లీచ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అయితే రవీంద్ర జడేజా, షమీ పార్టనర్ షిప్ తో భారత్ ఆధిక్యం 300 దాటింది. జడేజా 23 , షమీ 13 పరుగులకు ఔటవగా.. చివర్లో బూమ్రా మరోసారి మెరుపులు మెరిపిస్తాడని అనుకుంటే నిరాశపరిచాడు. ఖాతా తెరిచేందుకు 15 బంతులాడిన బూమ్రా ఒక భారీ సిక్సర్ కొట్టిన వెంటనే ఔటవడంతో భారత్ ఇన్నింగ్స్ కు తెరపడింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 378 పరుగుల టార్గెట్ ఉంచగలిగింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 4 , పాట్స్ 2 , బ్రాడ్ 2 , ఆండర్సన్, లీచ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 400 పరుగులలోపే భారత్ ను కట్టడి చేయడం ఇంగ్లాండ్ కు అడ్వాంటేజ్ అయినప్పటకీ.. నాలుగో ఇన్నింగ్స్ లో 378 పరుగుల టార్గెట్ ఛేజ్ చేయడం మాత్రం అంత సులభం కాదు. అయితే కివీస్ పై ఆ జట్టు ఎటాకింగ్ బ్యాటింగ్ ఆడి లక్ష్యాలను ఛేదించిన నేపథ్యంలో ఈ మ్యాచ్ ఫలితం ఎంతో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కు గెలుపు తప్పనిసరి. డ్రా కోసం పోరాడిన సిరీస్ భారత్ కైవసం చేసుకుంటుంది. దీంతో ఇంగ్లీష్ టీమ్ విజయం కోసమే ప్రయత్నించే అవకాశముంది.