IND vs SL: ఈ”డెన్” మనదే… లంకపై వన్డే సిరీస్ కైవసం
న్యూ ఇయర్‌లో టీమిండియా మరో సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
- By Anshu Published Date - 09:09 PM, Thu - 12 January 23

IND vs SL: న్యూ ఇయర్‌లో టీమిండియా మరో సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మరోసారి భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ పిచ్‌పై భారీస్కోర్ చేయాలనుకున్న శ్రీలంకను కట్టడి చేస్తూ 215 పరుగులకే ఆలౌట్ చేసింది. ఫెర్నాండో హాఫ్ సెంచరీతో మంచి ఆరంభాన్నివ్వడంతో 1 వికెట్‌కు 102 పరుగుల స్కోరుతో పటిష్టంగా కనిపించిన స్పిన్నర్ కుల్‌దీప్‌యాదవ్ ఎంట్రీతో అనూహ్యంగా కుప్పకూలింది. 25 పరుగుల తేడాతో ఐదు కీలక వికెట్లు చేజార్చుకుంది. దనంజయ డిసిల్వా, ఫెర్నాండో, దసున్ శనకా. చరిత్ అసలంక, వానిందు హసరంగా స్వల్ప వ్యవధిలోనే ఔట్ అయ్యారు. అయితే చివర్లో కసున్ రజిత, దునిత్ ఇద్దరూ కాసేపు వికెట్ల పతనాన్ని ఆపారు. వీరిద్దరూ 9వ వికెట్‌కు 42 పరుగులు జోడించడంతో స్కోరు 200 దాటగలిగింది. భారత బౌలర్లలో కుల్‌దీప్‌యాదవ్ 3 , సిరాజ్ 3 , ఉమ్రాన్ మాలిక్ 2 , అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టారు.
ఛేజింగ్‌లో భారత్ కూడా తడబడింది. గత మ్యాచ్‌లో మెరుపు ఆరంభాన్నిచ్చిన రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ త్వరగానే ఔటయ్యారు. రోహిత్ 17 , గిల్ 21 రన్స్‌కు వెనుదిరిగారు. తర్వాత కోహ్లీ 4 , శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులకే ఔటవడంతో భారత్ 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా జట్టును ఆదుకున్నారు. గత కొంత కాలంగా పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న రాహుల్ పరిణితి చెందిన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కు 75 పరుగులు జోడించాడు. పాండ్యా 36 రన్స్‌కు ఔటైనప్పటకీ.. అక్షర్ పటేల్‌తో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించిన రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అక్షర్ పటేల్ 21 రన్స్‌కు ఔటైన తర్రవాత కుల్‌దీప్ యాదవ్ సహకారంతో జట్టు విజయాన్ని పూర్తి చేశాడు. దీంతో టీమిండియా 43.2 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆదివారం తిరువనంతపురంలో జరుగుతుంది.