IND vs SA ODI : తొలి వన్డేకు భారత తుది జట్టు ఇదే
దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్న భారత్ ఇప్పుడు వన్డే సిరీస్ పై కన్నేసింది. టెస్ట్ సిరీస్ ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని భావిస్తోంది
- By Hashtag U Published Date - 01:15 PM, Tue - 18 January 22

దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్న భారత్ ఇప్పుడు వన్డే సిరీస్ పై కన్నేసింది. టెస్ట్ సిరీస్ ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య బుధవారం నుండి మూడు వన్డేల సిరీస్ మొదలుకానుంది. బొలాండ్ పార్క్‌లో తొలి వన్డే జరగనుండగా.. అక్కడే శుక్రవారం రెండో వన్డే, కేప్‌టౌన్ వేదికగా ఆదివారం ఆఖరి వన్డే జరగనుంది. ఈ వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే భారత జట్టు ప్రాక్టీస్ లో చెమటోడ్చుతోంది. సీనియర్, యువ ఆటగాళ్ళు ప్రాక్టీస్ లో బిజీబిజీగా ఉన్నారు. పేస్ కు అనుకూలించే సఫారీ పిచ్ లపై వ్యూహాత్మకంగా ఆడకుంటే కష్టమేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆటగాళ్ళందరికీ మెళకువలు చెబుతున్నాడు.
ఇదిలా ఉంటే తొలి వన్డేలో భారత తుది జట్టుపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. చాలా కాలం తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ తో కలిసి కెెఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. వచ్చే ఐపీఎల్ వేలంతో పాటు జాతీయ జట్టులో కెరీర్ మరికొంత కాలం కొనసాగాలంటే ఈ సిరీస్ లో ధావన్ రాణించాల్సిందే. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు రానుండగా.. నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ చేయనున్నారు. ఇక వికెట్ కీపర్ కోటాలో రిషబ్ పంత్ తుది జట్టులో చోటు దక్కించుకోగా.., ఆల్ రౌండర్ విభాగంలో యువ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ వైపే టీమ్ మేనేజ్ మెంట్ మొగ్గుచూపుతోంది. మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేసే సత్తా ఉండడం వెంకటేష్ అయ్యర్ కు కలిసొచ్చే అంశం. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా రవిచంద్రన్ అశ్విన్ బరిలోకి దిగుతుండగా.. పేస్ బాధ్యతలను బూమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్ మోయనున్నారు. అయితే పేస్ విభాగంలో దీపక్ చాహర్, శార్థూల్ ఠాకూర్ కూడా రేసులో ఉండగా.. తుది జట్టులో గట్టి పోటీ నెలకొంది. ప్రస్తుతం విశ్లేషకుల అంచనా ప్రకారం టీమ్ మేనేజ్ మెంట్ బూమ్రా, భువీ, సిరాజ్ లతో బరిలోకి దిగుతుందని భావిస్తున్నారు.