Steve Smith: చాలా కాలం తర్వాత ఫామ్‌లోకి వచ్చిన స్టీవ్ స్మిత్.. గబ్బాలో సెంచరీ చేసి ప్రత్యేక రికార్డు
భారత్‌పై ఇది అతనికి పదో సెంచరీ కాగా ఓవరాల్‌గా 33వ సెంచరీ. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు ఉన్నాయి. స్మిత్ టెస్ట్ క్రికెట్‌లో తన 33వ సెంచరీని సాధించిన వెంటనే.. అతను న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ అత్యధిక టెస్ట్ సెంచరీల రికార్డును వెనుకకు నెట్టాడు
- By Gopichand Published Date - 12:57 PM, Sun - 15 December 24

Steve Smith: పేలవమైన ఫామ్, విమర్శలతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) ఎట్టకేలకు మళ్లీ ఫామ్‌లోకి వచ్చి భారత్‌పై సెంచరీ సాధించాడు. బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్ మూడో మ్యాచ్‌లో స్మిత్ 185 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.
విలియమ్సన్‌ను స్టీవ్ స్మిత్ అధిగమించాడు
భారత్‌పై ఇది అతనికి పదో సెంచరీ కాగా ఓవరాల్‌గా 33వ సెంచరీ. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు ఉన్నాయి. స్మిత్ టెస్ట్ క్రికెట్‌లో తన 33వ సెంచరీని సాధించిన వెంటనే.. అతను న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ అత్యధిక టెస్ట్ సెంచరీల రికార్డును వెనుకకు నెట్టాడు. విలియమ్సన్ పేరు మీద 32 టెస్ట్ సెంచరీలు ఉన్నాయి.
Also Read: Vivo Y300 5G Launch: మార్కెట్ లోకి విడుదలైన వివో Y300 5జీ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే!
‘ఫ్యాబ్ ఫోర్’లో స్మిత్ రెండో స్థానంలో
ఈ సెంచరీతో స్మిత్ ఇప్పుడు ‘ఫ్యాబ్ ఫోర్’లో అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఆటగాడిగా రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్, న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్, భారత ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. 36 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్న రూట్ తర్వాత స్మిత్ రెండో స్థానంలో ఉన్నాడు. విలియమ్సన్ 32 సెంచరీలతో మూడో స్థానంలో, 30 సెంచరీలతో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నారు.
స్మిత్ కుక్‌ను సమం చేశాడు
స్టీవ్ స్మిత్ ఇప్పుడు ఇంగ్లండ్ గ్రేట్, మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్‌తో సెంచరీల సంఖ్యను సమం చేశాడు. ఇది కాకుండా అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 11వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో చాలా సమయం తీసుకున్న స్మిత్.. ఒక్కసారిగా సెటిల్ అయి తనదైన షాట్లు ఆడి సెంచరీ సాధించాడు.
స్మిత్-హెడ్ జట్టును కష్టాల నుంచి గట్టెక్కించారు
మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. ఆస్ట్రేలియా ఒక సమయంలో 75/3తో తడబడింది. అయితే హెడ్- స్మిత్ నాలుగో వికెట్‌కు 200 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా ఆతిథ్య జట్టును కష్టాల నుంచి గట్టెక్కించారు. వార్త రాసే సమయానికి ఆసీస్ జట్టు 6 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసింది. భారత్ బౌలింగ్‌లో బుమ్రా 5 వికెట్లు సాధించాడు. ఆసీస్ బ్యాటింగ్‌లో హెడ్, స్మిత్ సెంచరీలు చేశారు.