Ravi Shashtri: భారత్ ఓడిపోవాలని కోరుకున్నారు
టీమ్ ఇండియా మాజీ కోచ్ రవి శాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోచ్ గా తనను నియమించిన తర్వాత చాలా మంది భారత జట్టు ఓటమిని కోరుకున్నారని చెప్పాడు.
- By Naresh Kumar Published Date - 08:22 AM, Wed - 27 April 22

టీమ్ ఇండియా మాజీ కోచ్ రవి శాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోచ్ గా తనను నియమించిన తర్వాత చాలా మంది భారత జట్టు ఓటమిని కోరుకున్నారని చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే నా దగ్గర ఎలాంటి కోచింగ్ సర్టిఫికెట్స్ లేవు. భారత్ లాంటి దేశంలో ఒకడు పైకి ఎదుగుతున్నాడంటే కొన్ని వందల మంది దాన్ని చూసి తట్టుకోలేరు… మనం ఓడిపోవాలని కోరుకుంటూ ఉంటారు. నా విషయంలోనూ అదే జరిగింది.
అసూయతో రగిలిపోయే ఓ గ్యాంగ్ తనను దృష్టిలో పెట్టుకొని జట్టు ఓటమిని కోరుకుందని చెప్పాడు.అంత తాను తేలిగ్గా ఎవ్వరికీ లొంగననీ చెప్పుకొచ్చాడు. తాను ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడనన్నాడు. ఇక్కడ మనం ఏం చేసినా, దాన్ని విమర్శించడానికి, తప్పులు వెతకడానికి చాలామంది ఖాళీగా ఉంటారనీ, వాళ్ళను పట్టించుకోకూడదని సూచించాడు. దేశవాళీ క్రికెట్‌లో ఎక్కువ పని చేయాల్సి ఉంటుందనీ, అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వస్తే పని కంటే ఎక్కువ మాటలు పడుతూ, చాలామందికి ఏం చేస్తున్నామో సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నాడు.
అయితే ప్లేయర్లను మనం నమ్మి, వారిపై వారికి నమ్మకం కలిగిస్తే చాలు విజయాలు వాటంతట అవే వస్తాయన్నాడు. జట్టు వాతావరణం పాడుకాకుండా చూసుకుంటే సరిపోతుందనీ చెప్పాడు.
అడిలైడ్ టెస్టులో 36 పరుగులకు కుప్పకూలి..1-0 తో వెనుకబడి …మళ్ళీ సీరీస్ గెలుస్తామని ఎవ్వరూ ఊహించలేదన్నాడు. ఇంగ్లాండ్‌లోనూ విజయాలు ఏ జట్టుకైనా అంత తేలిగ్గా దొరకవనీ, ఇండియా సాధించిన విజయాలను రిపీట్ చేయడానికి చాలా టైం పడుతుందన్నాడు. టీమిండియాకి కోచ్‌గా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయినా విదేశాల్లో అసాధ్యమైన విజయాలు సాధించాడు రవిశాస్త్రి. కోహ్లీతో పాటు అజింకా రహానే, రోహిత్ శర్మ కెప్టెన్సీలో రవిశాస్త్రి కోచింగ్‌లో టీమ్ అద్భుత విజయాలు అందుకుంది.