IPL 2022: గుజరాత్ టైటాన్స్ కు బిగ్ రిలీఫ్
ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి ముందు కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆ జట్టు కెప్టెన్ హార్థిక్ పాండ్యా ఫిట్నెస్ సాధించాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో జరిగిన ఫిట్నెస్ టెస్టులో పాండ్యా పాసయ్యాడు.
- By Balu J Published Date - 11:04 AM, Thu - 17 March 22
ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి ముందు కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆ జట్టు కెప్టెన్ హార్థిక్ పాండ్యా ఫిట్నెస్ సాధించాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో జరిగిన ఫిట్నెస్ టెస్టులో పాండ్యా పాసయ్యాడు. దీంతో బీసీసీఐతో పాటు గుజరాత్ టైటాన్స్ కూడా ఊపిరి పీల్చుకుంది. పాండ్యా చాలా కాలంగా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. గత ఏడాది ప్రపంచకప్ తర్వాత జాతీయ జట్టుకు దూరమైన ఈ ఆల్‌రౌండర్ సొంతంగా ఫిట్నెస్ సంతరించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. పలుసార్లు బీసీసీఐ ఆదేశించినా జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్ళలేదు. అయితే ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి ముందు బీసీసీఐ పాండ్యాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. బెంగళూరులోని ఎన్‌సిఎలో ఫిట్నెస్ టెస్ట్ పాసైతేనే ఐపీఎల్ ఆడేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. దీంతో వెనక్కి తగ్గిన పాండ్యా ఎన్సీఎలో ఫిట్నెస్ టెస్టుకు హాజరయ్యాడు.
10 ఓవర్లు బౌలింగ్ చేస్తేనే ఫిట్నెస్ టెస్ట్ పాసైనట్టు పరిగణలోకి తీసుకుంటామని ఎన్‌సిఎ వర్గాలు చెప్పడం కూడా ఆసక్తిని రేకెత్తించింది. దీంతో బౌలింగ్‌ను సవాల్‌గా తీసుకున్న పాండ్యా ఫిట్నెస్ టెస్టులో సౌకర్యవంతంగానే బౌలింగ్ చేశాడు. వెన్నెముకకు సర్జరీ తర్వాత పాండ్యా బౌలింగ్ చేయడం లేదు. ఈ కారణంగానే జాతీయ జట్టుకు కూడా దూరమయ్యాడు. ఫీల్డ్‌లోనూ అంత సౌకర్యవంతంగా లేకపోవడంతో పూర్తి ఫిట్నెస్ సాధించి రావాలని సెలక్టర్లు పాండ్యాకు స్పష్టం చేయడంతో అప్పటి నుంచీ దానిపైనే దృష్టి పెట్టాడు. కోచ్‌గా ద్రావిడ్ వచ్చిన తర్వాత ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ మరింత కఠినంగా వ్యవహరించింది. వ్యక్తిగతంగా ఆటగాళ్ళ ఫిట్‌నెస్‌పై ద్రావిడ్ చాలా కఠినంగా ఉంటాడు. అందుకే రోహిత్‌శర్మతో సహా ఏ సీనియర్ క్రికెటర్‌కైనా నిబంధనలు ఒకేలా ఉంటాయని ద్రావిడ్ స్పష్టం చేయడం… అటు హిట్‌మ్యాన్ కూడా బరువు తగ్గి జట్టులోకి రావడం జరిగాయి. దీంతో హార్థిక్ కూడా ఫిట్నెస్ విషయంలో మళ్ళీ పూర్తి దృష్టి పెట్టి సక్సెసయ్యాడు.
కాగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ వదిలేయడంతో కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ పాండ్యాను రిటైన్ చేసుకుని కెప్టెన్సీ అప్పగించింది. ఇప్పుడు ఫిట్నెస్ టెస్ట్ పాసవడం , బౌలింగ్ కూడా వేస్తుండడంతో ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఐపీఎల్లో తొలిసారి అడుగుపెట్టిన గుజరాత్ తన తొలి మ్యాచ్‌లో మార్చి 28న లక్నో సూపర్‌జెయింట్స్‌తో ముంబై వేదికగా తలపడుతుంది.
Related News
Hardik Banned: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. వచ్చే సీజన్లో నిషేధం..!
ఐపీఎల్ 2024లో 67వ మ్యాచ్‌లో శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్‌ను 18 పరుగుల తేడాతో ఓడించింది.