GT vs RR: జైపూర్‌లో చేతులెత్తిసిన రాజస్థాన్… గుజరాత్ టైటాన్స్ బంపర్ విక్టరీ
ఐపీఎల్ 16వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ బంపర్ విక్టరీ కొట్టింది.
- Author : Naresh Kumar
Date : 05-05-2023 - 11:13 IST
Published By : Hashtagu Telugu Desk
GT vs RR: ఐపీఎల్ 16వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ బంపర్ విక్టరీ కొట్టింది. సొంతగడ్డపై తమకు ఎదురైన పరాభవానికి రాజస్థాన్ రాయల్స్‌పై ప్రతీకారం తీర్చుకుంది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ 11 పరుగులకే ఓపెనర్ బట్లర్ వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ జైశ్వాల్, కెప్టెన్ సంజూ శాంసన్ ధాటిగా ఆడి రెండో వికెట్‌కు 36 పరుగులు జోడించారు. దురదృష్టవశాత్తూ జైశ్వాల్ రనౌటవగా.. తర్వాత శాంసన్ 20 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటయ్యాడు.
శాంసన్ ఔటైన తర్వాత అశ్విన్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపించినా ఆ ప్రయోగం ఫలితాన్నివ్వలేదు. గుజరాత్ స్పిన్ ద్వయం రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ చెరొక ఎండ్ నుంచీ రాజస్థాన్‌ను కట్టడి చేశారు. వరుస వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రియాన్ పరాగ్ కూడా 4 పరుగులకే ఔటై నిరాశ పరిచాడు. ఆదుకుంటారనుకున్న హెట్‌మెయిర్ 7, ధృవ్ జురెల్ 9 పరుగులకే ఔటవడంతో రాజస్థాన్ మళ్లీ కోలుకోలేకపోయింది. పడిక్కల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. చివర్లో బౌల్ట్ 15 పరుగులు చేయడంతో స్కోర్ 100 దాటగలిగింది. చివరికి రాజస్థాన్ 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్ 2 , షమీ, పాండ్యా, జోష్ లిటిల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
టార్గెట్ పెద్దది కాకున్న గత అనుభవం దృష్ట్యా గుజరాత్ టైటాన్స్ తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు సాహా, శుభ్‌మన్ గిల్ తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు.గిల్ 35 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులకు ఔటయ్యాడు. అయితే సాహాతో కలిసి కెప్టెన్ హార్థిక్ పాండ్యా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. పాండ్యా కేవలం 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
సాహా 41 రన్స్‌తో అజేయంగా నిలిచాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 13.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్‌లో విఫలమైన రాజస్థాన్ బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సీజన్‌లో 5వ పరాజయం. మరోవైపు ఈ సీజన్‌లో గుజరాత్‌కు ఇది ఏడో విజయం. ఈ విజయంతో ఆ జట్టు ప్లే ఆఫ్ రేసులో ముందు నిలిచింది. మిగిలిన 4 మ్యాచ్‌లలో గుజరాత్ కనీసం ఒకటి గెలిచినా ప్లే ఆఫ్ చేరుతుంది.
That was some performance by @gujarat_titans 🙌#GT win the match by 9 wickets and add another 2 points to their tally 👌
Scorecard ▶️ https://t.co/54xkkylMlx#TATAIPL | #RRvGT pic.twitter.com/fJKu9gmvLW
— IndianPremierLeague (@IPL) May 5, 2023