Kambli: తీరు మారని భారత మాజీ క్రికెటర్
మన ప్రవర్తనే మన కెరీర్‌ను నిర్ణయిస్తుందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత నైపుణ్యం ఉన్నా.. సరైన నడవడిక లేకుంటే అథ:పాతాళానికి పడిపోవాల్సిందే. ప్రస్తుతం భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీనే దీనికి ఉదాహరణ.
- By Naresh Kumar Published Date - 08:12 AM, Mon - 28 February 22

మన ప్రవర్తనే మన కెరీర్‌ను నిర్ణయిస్తుందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత నైపుణ్యం ఉన్నా.. సరైన నడవడిక లేకుంటే అథ:పాతాళానికి పడిపోవాల్సిందే. ప్రస్తుతం భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీనే దీనికి ఉదాహరణ. తాజాగా ర్యాష్ డ్రైవింగ్ ఘటనతో అరెస్టయిన కాంబ్లీ మళ్ళీ వార్తల్లో నిలిచాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి స్కూల్ స్థాయిలో సంచలన ఇన్నింగ్స్ ఆడిన కాంబ్లి అతనితో పాటే జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. పలు మ్యాచ్‌లలోనూ సత్తా చాటాడు. అయితే వ్యక్తిగత ప్రవర్తన సరిగా లేకపోవడం, కెరీర్‌ను లీడ్ చేసే విషయంలో చేసిన తప్పిదాల కారణంగా ఎంతో అత్యున్నత స్థాయికి ఎదగాల్సిన కాంబ్లీ అర్థాంతరంగానే ఆటకు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. దీనికి కారణాలూ చెప్పుకోవాలంటే చెడు అలవాట్లు , దూకుడైన ప్రవర్తన ప్రధానంగా నిలిచాయి.
సహచరుడు సచిన్ తన కెరీర్‌ను అద్భుతంగా రూపుదిద్దుకుంటే… కాంబ్లి మాత్రం టాలెంట్ ఉన్నా ఆటపై పూర్తిగా దృష్టి పెట్టకుండా ఇతర వ్యాపకాలు , వివాదాలతో గొప్ప క్రికెటర్ అయ్యే అవకాశాన్ని తనకు తానే నాశనం చేసుకున్నాడు. ఈ పరిస్థితికి అతని స్వీయ తప్పిదాలే కారణమని క్రికెట్ వర్గాలు చెబుతుంటాయి. కేవలం 28 ఏళ్ళకే జట్టులో చోటు కోల్పోయిన కాంబ్లి కెరీర్‌లో పలు వివాదాలతో సహవాసం చేశాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత సినిమా రంగంలో అడుగుపెట్టి రెండు నిర్మాణ సంస్థలను ప్రారంభించాడు. అనంతరం 2009 మహారాష్ట్ర రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చిన ఈ మాజీ క్రికెటర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. మోడల్ ఆండ్రియా హెవిట్‌ను పెళ్ళి చేసుకుని ఇంటివాడైన తర్వాత కూడా పలు వివాదాలతోనే తరచుగా వార్తల్లో నిలిచాడు. అయితే సచిన్ తనకు అండగా నిలవలేదని, సరైన మార్గనిర్థేశం చేసి ఉంటే సరైన దారిలోనే వెళ్ళేవాడినంటూ పలు సందర్భాల్లో కాంబ్లీ వ్యాఖ్యానించాడు.
తాజాగా తాను నివాసముండే రెసిడెన్షియల్ గేటును కారుతో ఢీకొట్టడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. దీనికి సంబంధించి మూడు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ఆటపై ఫోకస్ పెట్టి ఉండుంటే భారత జట్టుకు సుధీర్ఘ కాలం ఆడేవాడని పలువురు మాజీ క్రికెటర్లు కాంబ్లీ గురించి చెబుతుంటారు. ఏదైతేనేం ఆటగాడిగా ఎంత నైపుణ్యం ఉన్నా.. క్రమశిక్షణ, సరైన ప్రవర్తన లేకుంటే కెరీర్ మధ్యలోనే ముగుస్తుందనడానికి కాంబ్లీ జీవితమే ఉదాహరణగా చెప్పొచ్చు.