Danushka Gunathilaka: గుణతిలకకు బిగ్ షాక్.. సస్పెండ్ చేసిన లంక క్రికెట్ బోర్డు..!
శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక లైంగిక దాడి ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
- Author : Gopichand
Date : 07-11-2022 - 3:41 IST
Published By : Hashtagu Telugu Desk
శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక లైంగిక దాడి ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా గుణతిలకపై శ్రీలంక క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.
శ్రీలంక బ్యాటర్ దనుష్క గుణతిలక అనుమతి లేకుండా ఓ మహిళపై లైంగిక సంపర్కానికి సంబంధించి నాలుగు ఆరోపణలపై అభియోగాలు మోపిన తర్వాత సిడ్నీ కోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది. సిడ్నీ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని టీమ్ హోటల్‌లో ఆదివారం తెల్లవారుజామున అతన్ని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత జట్టులోని మిగిలిన వారు శ్రీలంకకు తిరిగి వెళ్లారు. శ్రీలంక క్రికెట్ (SLC) ప్రెసిడెంట్ షమ్మీ సిల్వా మాట్లాడుతూ.. శ్రీలంక బోర్డు గుణతిలకను అన్ని రకాల క్రికెట్ నుండి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాలో జరిగిన ఘటన గురించి విచారణ చేపట్టనున్నట్లు లంక క్రికెట్ బోర్డు తెలిపింది. ఒకవేళ దనుష్క దోషిగా తేలితే చట్ట ప్రకారం శిక్షించనున్నట్లు క్రికెట్ బోర్డు వెల్లడించింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన తనపై దనుష్క లైంగిక దాడి చేసినట్టు ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో న్యూసౌత్‌వేల్స్ పోలీసులు ఆదివారం క్రికెటర్ దనుష్కను అరెస్టు చేశారు. గుణతిలక లంక తరపున 8 టెస్టులు, 47 వన్డేలు (ODIలు), 46 T20Iలు ఆడాడు. గుణతిలకపై ఈ తరహా ఆరోపణలు రావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ ఓ అమ్మాయి అతనిపై అత్యాచార ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.