Team India: వన్డే సిరీస్‌లో భారత్ బోణీ
సొంతగడ్డపై అదరగొడుతోంది టీమిండియా... లంకపై టీ ట్వంటీ సిరీస్ గెలిచిన భారత్ ఇప్పుడు వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది.
- By Anshu Published Date - 09:51 PM, Tue - 10 January 23

Team India: సొంతగడ్డపై అదరగొడుతోంది టీమిండియా… లంకపై టీ ట్వంటీ సిరీస్ గెలిచిన భారత్ ఇప్పుడు వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. తొలి వన్డేలో శ్రీలంకపై విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 19.4 ఓవర్లలో 143 పరుగులు జోడించారు. చాలా కాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న రోహిత్ ఈ మ్యాచ్‌లో ధాటిగా ఆడాడు. అటు గిల్ కూడా పోటాపోటీగా బౌండరీలు బాదడంతో భారత్ స్కోర్ టాప్ గేర్‌లో సాగింది. రోహిత్ 67 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 83 రన్స్ చేయగా.. గిల్ 11 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఔటైనా కోహ్లీ రెచ్చిపోయాడు. లంక బౌలర్లను ఆటాడుకున్న విరాట్ భారీ షాట్లతో అలరించాడు. కొత్త ఏడాదిలోనూ తన ఫామ్ కొనసాగిస్తూ శతకం సాధించాడు. కేవలం 80 బాల్స్‌లోనే సెంచరీ చేసిన కోహ్లికి వన్డేల్లో ఇది 45వ సెంచరీ. అంతేకాదు సొంతగడ్డపై ఇది 20వ సెంచరీ. ఇప్పటి వరకూ సొంతగడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ సమం చేశాడు. వన్డేల్లో గతేడాది నాలుగేళ్ల సెంచరీ కరువుకు తెరదించుతూ బంగ్లాదేశ్‌పై మూడంకెల స్కోరు చేసిన కోహ్లి.. అదే ఊపును కొత్త ఏడాదిలోనూ కొనసాగించాడు. దీంతో భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 373 పరుగులు చేసింది. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇండియా 400 మార్క్‌ను అందుకోలేకపోయింది.
ఛేజింగ్‌లో శ్రీలంక పెద్దగా పోటీనివ్వలేకపోయింది. ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ నిస్సాంక , డిసిల్వా ,శనక త్పపిస్తే మిగిలినవారంతా విఫలమయ్యారు. నిస్సాంక 80 బంతుల్లో 11 ఫోర్లతో 72 రన్స్ చేయగా.. అసలంక 23 , డిసిల్వా 47 పరుగులకు ఔటయ్యారు. 179 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినప్పటకీ… శనక^కెప్టెన్ ఇన్నింగ్స్‌తో పోరాడాడు. దీంతో లంక స్కోర్ 300 దాటగలిగింది. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన శనక^చివర్లో వరుస ఫోర్లతో మెరుపులు మెరిపించాడు. ఈ క్రమంలో 87 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శనక సెంచరీ కేవలం పరుగుల అంతరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడింది. లంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 306 పరుగులు చేసింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో రెండో మ్యాచ్ గురువారం కోల్‌కతాలో జరగనుంది.