Royal London One-Day Cup : పుజారా ధనాధన్ ఇన్నింగ్స్
టెస్ట్ స్పెషలిస్ట్... వన్డేలకు కష్టమే... టీ ట్వంటీలకు అసలు సూట్ కాడు..ఇదీ చటేశ్వర పుజారాపై ఉన్న అభిప్రాయం.
- By Naresh Kumar Published Date - 01:59 PM, Mon - 15 August 22

టెస్ట్ స్పెషలిస్ట్… వన్డేలకు కష్టమే… టీ ట్వంటీలకు అసలు సూట్ కాడు..ఇదీ చటేశ్వర పుజారాపై ఉన్న అభిప్రాయం. ప్రస్తుతం ఈ అభిప్రాయాన్ని మార్చే దిశగా అడుగులు వేస్తున్నాడు పుజారా. ఇంగ్లాండ్ కౌంటీల్లో దుమ్ము రేపుతున్న పుజారా తాజాగా పరిమిత ఓవర్ల ఫార్మేట్ లోనూ అదరగొడుతున్నాడు. నిజానికి ద్రావిడ్ తర్వాత ఈ స్థాయిలో టెస్ట్ క్రికెట్ లో నిలకడగా రాణించింది పుజారా మాత్రమే. దీంతో ఈ బ్యాటర్ కేవలం సంప్రదాయ క్రికెట్ కే పనికొస్తాడనే ముద్ర పడిపోయింది. అటు ఐపీఎల్ లో కూడా పుజారాను తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. తీసుకున్న జట్లూ పెద్దగా అవకాశాలు ఇచ్చింది లేదు. అయితే గత ఏడాది సెకండాఫ్ లో పుజారా పేలవ ఫామ్ తో ఇబ్బంది పడ్డాడు. టెస్ట్ జట్టులోనూ చోటు కోల్పోయాడు. దీంతో ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఆడి మళ్ళీ ఫామ్ అందుకున్నాడు. అక్కడ నుంచి పుజారా పరుగుల వరద కొనసాగుతూనే ఉంది. ససెక్స్ తరపున కౌంటీ క్రికెట్ లో వరుస సెంచరీలు బాదిన పుజారా ఇప్పుడు రాయల్ వన్డే కప్ లోనూ దుమ్ము రేపుతున్నాడు. తాజాగా అతను ఆడిన ధనాధన్ ఇన్నింగ్స్ క్రికెట్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. తనపై ఉన్న టెస్ట్ స్పెషలిస్ట్ ముద్రకు భిన్నంగా టీ ట్వంటీ తరహాలో రెచ్చిపోయాడు. టెస్టుల్లో ఓవర్లకు ఓవర్లు ఆడుతూ , డిఫెన్స్‌తో బౌలర్లను విసిగించే పూజారా, రాయల్ కప్‌లో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. వార్‌విక్‌షైర్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 73 బంతుల్లో సెంచరీ చేసిన పూజారా, తాజాగా సుర్రేతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ భారీ సెంచరీతో విశ్వరూపం చూపించాడు సర్రే టీమ్ తో జరిగిన మ్యాచ్ లో 131 బాల్స్ లో 174 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. అతడి ఇన్నింగ్స్ లో ఐదు సిక్సర్లు, ఇరవై ఫోర్లు ఉన్నాయి. పుజారా మెరుపు బ్యాటింగ్ తో పాటు టామ్ క్లార్క్ సెంచరీ చేయడంతో ససెక్స్ టీమ్ యాభై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 378 రన్స్ చేసింది. పూజారా ఆడిన ఆఖరి 20 బంతుల్లో 53 పరుగులు రాబట్టడం విశేషం… అంతకుముందు కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022లో 8 మ్యాచులు ఆడిన ఛతేశ్వర్ పూజారా 13 ఇన్నింగ్స్‌ల్లో 109.40 సెన్సేషనల్ యావరేజ్‌తో 1094 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ఛల జాబితాలో రెండో స్థానం పూజారాదే. సీజన్‌లో 5 సెంచరీలు చేసిన పూజారా, అత్యధిక సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు. తాజాగా పూజారా మాస్ బ్యాటింగ్ చూసిన ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. టీమిండియా వన్డే టీమ్‌లో చోటు కోసం శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా వంటి కుర్రాళ్లతో పోటీపడేందుకు సిద్ధమవుతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.