Cheteshwar Pujara: కౌంటీల్లో పుజారా మరో రికార్డ్
గత ఏడాది జాతీయ జట్టులో చోటు కోల్పోయిన తర్వాత కౌంటీ క్రికెట్ ఆడిన భారత టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర పుజారా తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు.
- By Naresh Kumar Published Date - 08:57 PM, Fri - 29 July 22

గత ఏడాది జాతీయ జట్టులో చోటు కోల్పోయిన తర్వాత కౌంటీ క్రికెట్ ఆడిన భారత టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర పుజారా తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. కౌంటీల్లో తిరుగులేని బ్యాటింగ్‌తో పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా ఒక సీజన్‌లో వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు.
ఈ సీజన్‌లో పుజారా ససెక్స్ తరపున 8 మ్యాచ్‌లాడి 1095 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉండగా.. వాటిలో మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో డెర్బీషైర్, డుర్హమ్, మిడిలెసెక్స్ జట్లపై పుజారా ద్విశతకాలు సాధించాడు. ఇక ఈ సీజన్‌లో కౌంటీల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గ్లామోర్గాన్ ఆటగాడు సామ్ నార్త్‌ఈస్ట్ 10 మ్యాచ్‌ల్లో 1127 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇటీవలే లీస్టర్‌షైర్‌తో మ్యాచ్‌లో నార్త్‌ఈస్ట్ 401 పరుగులు రికార్డు ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఇక ససెక్స్ తరపున ఆడుతున్న పుజారా 8 మ్యాచ్‌ల్లో 1095 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. డెర్బీషైర్ ఆటగాడు షాన్ మసూద్ 8 మ్యాచ్‌ల్లో 1074 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. పుజారా వ్యక్తిగత రికార్డుతో మెరిసినప్పటికి అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ససెక్స్ మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.
నాటింగ్‌హమ్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్ 256 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ 11 మ్యాచ్‌ల్లో ఒక విజయం.. ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉండగా.. భారీ విజయంతో నాటింగ్‌హమ్‌షైర్ టాప్ స్థానానికి దూసుకెళ్లింది. నాటింగ్‌హమ్‌షైర్ 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. ఒక ఓటమితో తొలి స్థానంలో ఉంది. అయితే టీ ట్వంటీ వరల్డ్‌కప్ తర్వాత భారత్ వరుసగా పెద్ద జట్లపై టెస్ట్ సిరీస్‌లు ఆడనున్న నేపథ్యంలో పుజారా సూపర్ ఫామ్ అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు.