Jhulan Goswami: థాంక్యూ జులన్…
భారత్ లో ఫాస్ట్ బౌలర్లు రావడం కష్టమే...చాలా కాలం క్రితం వినిపించిన మాట...అందులోనూ మహిళల క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్...
- By Naresh Kumar Published Date - 10:47 AM, Sun - 25 September 22
భారత్ లో ఫాస్ట్ బౌలర్లు రావడం కష్టమే…చాలా కాలం క్రితం వినిపించిన మాట…అందులోనూ మహిళల క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్…అది కూడా 20 ఏళ్ల పాటు కొనసాగడం అంటే అది అద్భుతమనే అంగీకరించాలి….ఇలాంటి అద్భుతమే భారత్ మహిళల జట్టు సీనియర్ పేసర్ జులన్ గోస్వామి…
ఒకటి కాదు… రెండు కాదు…ఏకంగా రెండు దశాబ్దాల పాటు నిలకడగా కొనసాగడం మామూలు విషయం కాదు. పైగా ఫాస్ట్ బౌలర్ అంటే గాయాలు వెంటాడుతూనే ఉంటాయి. వీటిని అధిగమిస్తూ ..ఫిట్ నెస్ కాపాడుకుంటూ అన్నేళ్ళ పాటు కెరీర్ కంటిన్యూ చేయడం అంటే ఆమె అంకిత భావం, పట్టుదలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చాలా మంది లానే జులన్ కూడా
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది.
పశ్చిమబెంగాల్ లోని నదియా జిల్లా చక్డా జులన్ సొంతఊరు. జులన్‌కు బెంగాల్ లో అందరి మాదిరే ఫుట్‌బాల్ అంటే ఇష్టం. కానీ టీవీలలో వచ్చే క్రికెట్ మ్యాచ్‌లను చూసి ఆమె దృష్టి బంతి మీద పడింది.చిన్నప్పట్నుంచే క్రికెట్ మీద మక్కువ పెంచుకున్న జులన్.. పన్నెండేండ్ల వయసు నుంచే స్కూల్ లో, ఊళ్లో అబ్బాయిలతోనే క్రికెట్ ఆడేది. అప్పటికీ అమ్మాయిల క్రికెట్ కు ఇప్పుడున్నంత ఆదరణ కూడా లేదు. అయినా తన లక్ష్యం వైపు సాగింది.1997లో ఈడెన్ గార్డెన్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్ల మధ్య వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు జులన్ బాల్ గర్ల్ గా పనిచేసింది. ఆ మ్యాచ్ చూసిన జులన్ భారత్ తరఫున కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని అనుకుంది. క్రికెట్ కోచింగ్ కోసం ఉదయం, సాయంత్రం రోజుకు 160 కిలోమీటర్లు ప్రయాణం చేసేది. 19 ఏండ్ల వయసులో ఆమె.. తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది.
భారత జట్టు తరఫున ఆడుతూ ఒక్క వికెట్ తీసినా చాలు అని కలలు కన్న జులన్ గోస్వామి.. తన కెరీర్ లో ఎన్నో రికార్డులు నెలకొల్పింది. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఆమెదే. తన సుదీర్ఘ కెరీర్ లో మొత్తం 353 వికెట్లు పడగొట్టింది. మహిళల క్రికెట్ లో మరే బౌలర్ ఇన్ని వికెట్లు తీయలేదు. ముఖ్యంగా వన్డేలలో ఆమె రికార్డులు చేరుకునే బౌలర్ అయితే దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. జులన్ తన కెరీర్ లో 12 టెస్టులలో 44 వికెట్లు, 203 వన్డేలలో 253 వికెట్లు, 68 టీ20లలో 56 వికెట్లు తీసింది. రెండు దశాబ్దాల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన జులన్ గోస్వామి క్రికెట్ మక్కా లార్డ్స్ లో కెరీర్ ముగించింది. తన చివరి మ్యాచ్ లో రెండు వికెట్లు పడగొట్టిన జులన్ కు ఇంగ్లాండ్ పై వన్డే సీరీస్ క్లీన్ స్వీప్ తో సహచరులు ఘనంగా వీడ్కోలు పలికారు.మొత్తం మీద జులన్ కెరీర్ ప్రతీ యువ క్రికెటర్ కూ స్పూర్తి ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Related News
Happy Birthday Anushka Sharma: హ్యాపీ బర్త్ డే అనుష్క శర్మ.. “రబ్ నే బనాదీ బ్యూటీ”
అనుష్క శర్మ రాబోయే ప్రాజెక్ట్‌లు విజయవంతం కావాలని మేం మనసారా కోరుకుంటున్నాం. బహుముఖ నటనా నైపుణ్యాలు, చక్కనైనా ఫ్యాషన్ సెన్స్‌కు కేరాఫ్ అడ్రస్ అనుష్క (Anushka Sharma).