2023 World Cup: భారత్ ప్రపంచ కప్ గెలవలేదు…మాజీ ఆల్ రౌండర్ హాట్ కామెంట్స్
వన్డే ప్రపంచ కప్ కు కౌంట్ డౌన్ మొదలయింది. ఒక్కో టీమ్ తమ జట్ల కూర్పును సిద్దం చేసుకుంటున్నాయి. సొంత గడ్డపై టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.
- By Praveen Aluthuru Published Date - 07:19 PM, Tue - 8 August 23

2023 World Cup: వన్డే ప్రపంచ కప్ కు కౌంట్ డౌన్ మొదలయింది. ఒక్కో టీమ్ తమ జట్ల కూర్పును సిద్దం చేసుకుంటున్నాయి. సొంత గడ్డపై టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఐసీసీ టోర్నీలో విజేతగా నిలిచి దాదాపు పుష్కర కాలం దాటిపోయింది. ఈసారి సొంత గడ్డపై వరల్డ్ కప్ కల నెరవేరుతుందని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.
అయితే భారత్ కప్ గెలవడం కష్టమేనని మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మిడిలార్డర్ లో సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించనంత వరకూ వరల్డ్ కప్ గెలిచే అవకాశం ఉండదన్నాడు.తాను భారతీయుడిని కాబట్టి భారత్ గెలుస్తుందంటూ ఓ దేశభక్తుడిగా చెప్పొచ్చనీ, అయితే మన మిడిలార్డర్ చాలా వీక్ గా ఉందన్నాడు. దీనికి కారణం గాయాలేననీ, వాటిని పరిష్కరించకపోతే టీమ్ తడబడుతుందన్నాడు. ముఖ్యంగా ఒత్తిడి ఎక్కువగా ఉండే మ్యాచ్ లలో ఎలాంటి ప్రయోగాలు చేయకూడదనీ సూచించాడు.
ఓపెనర్ గా రావడం కంటే మిడిలార్డర్ లో బ్యాటింగ్ పూర్తి భిన్నంగా ఉంటుందన్నాడు. మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేసే ప్లేయర్స్ తో టీమ్ మేనేజ్‌మెంట్ లో ఎవరైనా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించాడు. మిడిలార్డర్ సిద్ధంగా లేదనీ, వాళ్లను ఎవరో ఒకరు సిద్ధం చేయాలనీ యువీ అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే భారత్ తుది జట్టు కూర్పుపైనా యువీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెగా టోర్నీకి ఇంకా రెండు నెలలు టైం కూడా లేదనీ , ఇప్పటికే మన తుది జట్టుపై టీమ్ మేనేజ్ మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతోందన్నాడు. రాహుల్, శ్రేయస్ అయ్యర్, పంత్ లాంటి వాళ్లకు గాయాలు కావడంతో మిడిలార్డర్ బలహీనమైందన్న యువీ… సూర్యకుమార్, సంజూ శాంసన్ లాంటి వారితో ప్రయోగాలు చేస్తోందన్నాడు. దీనిపైనే యువీ ఆందోళన వ్యక్తం చేశాడు. ఓపెనర్లు త్వరగా ఔటైతే ఓ భాగస్వామ్యాన్ని నిర్మించాల్సి ఉంటుందనీ, మిడిలార్డర్ బ్యాటర్లు వచ్చీ రావడంతోనే హిట్టింగ్ చేయాలని చూస్తున్నారన్నాడు. వాళ్లు ఒత్తిడిని అధిగమించాలనీ,కొన్ని బంతులను వదిలేయాలన్నాడు. ప్రస్తుతం యువరాజ్ సింగ్ చేసిన కామెంట్స్ పై ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read: Oppo A58 4G: మార్కెట్ లోకి మరో ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఫీచర్స్ ఇవే?