BWF Championship: క్వార్టర్ ఫైనల్లో చిరాగ్ శెట్టి-సాత్విక్ జోడీ
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో గురువారం భారత్ కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్ లో చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి జోడి క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది.
- By Naresh Kumar Published Date - 05:41 PM, Thu - 25 August 22

బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో గురువారం భారత్ కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్ లో చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి జోడి క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది. టోక్యో వేదికగా జరిగిన ప్రిక్వార్టర్స్‌లో 21-12, 21-10 తేడాతో డానిష్ జంట జెప్పీ బే, లాస్సే మోల్హెడేను పై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ ,చిరాగ్ జోడీ జపాన్ ద్వయం టకురో హోకి, యుగో కొబయాషితో తలపడనుంది. మరోవైపు భారత షట్లర్లు ధ్రువ్ కపిల- ఎం.ఆర్ అర్జున్ తొలి సారి బీడబ్ల్యూఎఫ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ప్రీ-క్వార్టర్‌ఫైనల్లో హీ యోంగ్ కాయ్ టెరీ–లో కీన్ హీన్ జంటను ఓడించి ఈ ద్వయం క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. ఇదిలా ఉంటే మహిళల సింగిల్స్ లో భారత పోరాటం ముగిసింది.
మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ పరాజయం పాలైంది. థాయ్‌లాండ్‌కు చెందిన షట్లర్ బుసానన్ ఒంగ్బామ్రంగ్‌ఫాన్ చేతిలో ఓడిపోయింది. గంటా నాలుగు నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ మ్యాచ్‌లో బుసానన్ ఆరంభం నుంచే డామినేట్ చేసింది. సైనా మొదటి గేమ్‌ను కోల్పోయినప్పటకీ… తర్వాత పుంజుకుని రెండో గేమ్ గెలిచింది. అయితే మూడో గేమ్‌లో మాత్రం బుసానన్ 21-13తో సైనాను ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.