Bhuvaneswar Kumar: తొలి నాళ్లలో సచిన్‌ని డకౌట్ చేసిన భువనేశ్వర్ కుమార్
2008-2009 రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ , ముంబై జట్లు తలపడ్డాయి. ఉత్తరప్రదేశ్ తరుపున ఆడుతున్న ఓ పంతొమ్మిదేళ్ళ కుర్రాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సచిన్‌ను డకౌట్ చేశాడు.
- By Naresh Kumar Published Date - 03:19 PM, Thu - 6 February 25

2008-2009 రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ , ముంబై జట్లు తలపడ్డాయి. ఉత్తరప్రదేశ్ తరుపున ఆడుతున్న ఓ పంతొమ్మిదేళ్ళ కుర్రాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సచిన్‌ను డకౌట్ చేశాడు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. సచిన్ ని అవుట్ చేసిన ఆ కుర్రాడి గురించి ప్రపంచ క్రికెట్ మాట్లాడుకుంది. కానీ మూడేళ్లకే ఆ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఈ కుర్రాడు మరెవరో కాదు టీమిండియా స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్.
తన స్వింగ్ చూసి ప్రత్యర్థి బ్యాటర్లు ఒళ్ళు దెగ్గరపెట్టుకుని బ్యాటింగ్ చేసేవాళ్ళు. బంతి ఎటు నుంచి ఎటు వైపుగా వస్తుందో తెలిసేలోపే వికెట్లు నెలకులేవీ. అలాంటి భువనేశ్వర్ ప్రస్తుతం జట్టుకు దూరమయ్యాడంటే బాధ కలిగిస్తుంది. అంతేకాదు తానిప్పుడు క్రికెటర్ ని కూడా కాదంటూ కేవలం ఇండియన్ ని మాత్రమేనని చెప్పుకునే పరిస్థితి. మరి ఈ పరిస్థితిని కల్పించింది ఎవరో కానీ జట్టు మాత్రం మంచి బౌలర్ ని మిస్ అవుతుంది. బీసీసీఐ భువీకి అవకాశాలు ఇవ్వకపోవడంతోనే అతని కెరీర్ ముగిసిందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. తన 23వ యేటా పాకిస్థాన్‌తో జరిగిన వన్డేలో అరంగేట్రం చేశాడు. తన వన్డే కెరీర్‌లోని మొదటి బంతికే వికెట్ తీసి సంచలనం సృష్టించాడు. తన ఇన్-స్వింగ్ బంతితో పాకిస్తాన్ ప్లేయర్ మొహమ్మద్ హఫీజ్‌ను అవుట్ చేశాడు. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్లోనూ భువీ గురించి చర్చ జరిగింది.
2014లో ఇంగ్లాండ్ పర్యటనలో మొత్తం 19 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్ తోనే కాక బ్యాటింగ్ తోనూ అదరగొట్టాడు. కీలక సమయంలో తనవంతు బ్యాటింగ్ విభాగానికి కృషి చేశాడు. భువీ తన కెరీర్లో టెస్టుల్లో మూడు, వన్డేలో ఒక అర్ధ సెంచరీ నమోదు చేశాడు. భువి 1990 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో జన్మించాడు. అతని తండ్రి కిరణ్ పాల్ సింగ్ సబ్-ఇన్స్పెక్టర్. తల్లి ఇంద్రేష్ సింగ్, ఆమె గృహిణి. అక్క రేఖ భువిని ప్రోత్సహించింది. తన ఇష్టాన్ని గుర్తించిన అక్క రేఖ అతని 12వ యేటా క్రికెట్ కోచింగ్ ఇప్పించింది. భువనేశ్వర్ కుమార్ చిన్ననాటి కోచ్ సంజయ్ రస్తోగి అతని ప్రతిభను గుర్తించి శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. భువనేశ్వర్ కుమార్ బాల్యం విక్టోరియా పార్క్‌లో గడిచింది, అదే అతని ప్రాక్టీస్ గ్రౌండ్. భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు. రెండు సీజన్లలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అతను పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. భారత జట్టు తరఫున భువీ టెస్టుల్లో 63 వికెట్లు, వన్డేల్లో 141, టీ20ల్లో 90 వికెట్లు పడగొట్టాడు.టెస్టుల్లో 552 పరుగులు, వన్డేల్లో 552 పరుగులు, టీ20ల్లో 67 పరుగులు చేశాడు. టి20లో భువీ అత్యుత్తమ ప్రదర్శన 4 పరుగులకు 5 వికెట్లు తీయడం. దేశవాళీ క్రికెట్‌లో సచిన్‌ను సున్నా స్కోరుకే అవుట్ చేసిన ఏకైక బౌలర్ భువనేశ్వర్. కాగా 2018 జనవరిలో టీమిండియా తరపున తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2022లో చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. కాగా భువి తన చివరి మ్యాచ్‌ను 2022లో జరిగిన టి20 ప్రపంచ కప్‌లో ఆడాడు