రెండు వేదికల్లోనే భారత్,విండీస్ సిరీస్
దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
- By Hashtag U Published Date - 12:41 PM, Thu - 20 January 22

దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అయితే ప్రస్తుతం భారత్‌లో కరోనా థర్డ్‌వేవ్ ఉదృతి పెరుగుతుండంతో ఈ సిరీస్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సిరీస్ రెండు వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి వన్డే , టీ ట్వంటీ సిరీస్ లు షెడ్యూల్ ప్రకారం ఆరు వేదికల్లో జరపాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఉండడంతో బబూల్ ను ఆరు వేదికల్లో సురక్షితంగా ఏర్పాటు చేయడం అంత సులభం కాదు. దీనిని దృష్టిలో పెట్టుకుని సిరీస్ లను రెండు వేదికలకే పరిమితం చేయాలని బోర్డు భావిస్తోంది. దీనిపై ఇప్పటికే సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ అధికారులు చర్చించారు. అహ్మదాబాద్ , కోల్ కత్తాలలో విండీస్ టూర్ ముగించేలా ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రా క్రికెట్ బోర్డులకు కూడా సమాచారమిచ్చిన బోర్డు ఏర్పాట్లపై చర్చించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు లేకుండానే ఈ మ్యాచ్ లు నిర్వహించనుంది. ఇటీవల రంజీ టోర్నీ ఆరంభానికి ముందే ఆటగాళ్ళకు కోవిడ్ సోకడంతో సీజన్ మొత్తాన్ని బీసీసీఐ అర్థాంతరంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో విండీస్ తో సిరీస్ కు పకడ్బందీగా బబూల్ ను రూపొందించాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా.. ఫిబ్రవరి 6 న జరిగే తొలి వన్డేతో భారత్-వెస్టిండీస్ సిరీస్ మొదలు కానుంది. అయితే రెండు వేదికలకే సిరీస్ ను పరిమితం చేయాలన్న నిర్ణయంపై బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.