IPL 2022 : బెంగుళూరు, లక్నో మ్యాచ్ లో అదే టర్నింగ్ పాయింట్
ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 18 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది
- By Naresh Kumar Published Date - 05:04 PM, Wed - 20 April 22

ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 18 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. తాజా సీజన్‌లో ఏడో మ్యాచ్ ఆడిన బెంగళూరు టీమ్‌కి ఇది ఐదో గెలుపుకాగా.. పాయింట్ల పట్టికలోనూ ఆ జట్టు 10 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. మరోవైపు ఏడు మ్యాచ్‌లాడిన లక్నో టీమ్.. మూడో విజయంతో నాలుగో స్థానానికి పడిపోయింది.
అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఆర్సీబీ నిర్దేశించిన టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ 24 బంతుల్లో 3ఫోర్లు, ఒక సిక్స్ తో 30 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు గేర్ మార్చుతూ కనిపించాడు. ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడి కోసం ప్రయత్నిస్తున్న సమయంలో రాహుల్ అనూహ్యంగా ఔటైపోయాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఆరో బంతికి రాహుల్ ఔటయ్యాడు.
నిజానికి రాహుల్‌ని ఫీల్డ్ అంపైర్ ఔటివ్వలేదు. హర్షల్ పటేల్ వేసిన బంతిని ప్లిక్ చేసేందుకు రాహుల్ ప్రయత్నించగా… బంతి బ్యాట్ ఎడ్జ్ తాకుతూ బంతి వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చేతుల్లోకి వెళ్లింది.
దాంతో హర్షల్ పటేల్ క్యాచ్ ఔట్ కోసం అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ బంతి బ్యాట్ కు తాకలేదని నాటౌట్ ఇచ్చాడు. కానీ హర్షల్ పటేల్.. బంతి బ్యాట్‌కి తాకిందని నమ్మకంగా చెప్పడంతో కెప్టెన్ డుప్లెసిస్ డీఆర్‌ఎస్ కోరాడు.. అయితే రిప్లైలో బ్యాట్ ఎడ్జ్‌ని బంతి తాకినట్లు కనిపించింది. దాంతో కేఎల్ రాహుల్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే సూపర్ ఫామ్ లో ఉన్న రాహుల్ ఔటైన తర్వాత లక్నో జట్టు తిరిగి పుంజుకోలేకపోయింది.