Avinash Sable: ఒకప్పుడు ఆర్మీ ఉద్యోగి.. నేడు ఒలింపిక్స్‌లో భారత్ తరపున స్టీపుల్‌చేజ్ రన్నర్, ఎవరీ అవినాష్ సాబ్లే..!
భారతదేశపు స్టార్ స్టీపుల్‌చేజ్ రన్నర్ అవినాష్ సాబ్లే 13 సెప్టెంబర్ 1994న మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని మాండ్వా గ్రామంలో జన్మించాడు.
- By Gopichand Published Date - 07:19 PM, Thu - 25 July 24

Avinash Sable: పారిస్ ఒలింపిక్స్ 2025కి ఇప్పుడు కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. గత అన్ని ఒలింపిక్స్ కంటే పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ప్రదర్శన మెరుగ్గా ఉంటుందని దేశప్రజలు పూర్తి ఆశతో ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ స్టీపుల్‌చేజ్ రన్నర్ అవినాష్ సాబ్లే (Avinash Sable)పైనే అందరి దృష్టి ఉంది. సాబ్లే ఇటీవలి కాలంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతను పారిస్ ఒలింపిక్స్‌లో పతకం కోసం పెద్ద పోటీదారుగా ఉన్నాడు. స్టీపుల్‌చేజ్‌లో విజయం సాధించేందుకు అవినాష్ చాలా కష్టపడుతున్నాడు. అసలు అవినాష్ సాబ్లే ఎవరో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
అవినాష్ సాబ్లే ఎవరు?
భారతదేశపు స్టార్ స్టీపుల్‌చేజ్ రన్నర్ అవినాష్ సాబ్లే 13 సెప్టెంబర్ 1994న మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని మాండ్వా గ్రామంలో జన్మించాడు. అవినాష్ చాలా సాధారణ కుటుంబంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు రైతులు. అవినాష్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడేవాడు. అవినాష్ తన చిన్నతనంలో పాఠశాలకు వెళ్లాలంటే రోజూ 6 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. అసలు తన ఊరిలో రవాణా సౌకర్యం లేకపోవడంతో అవినాష్ స్కూల్‌కి నడిచి వెళ్లాల్సి వచ్చేది.
ఏదో ఒక రోజు స్పోర్ట్స్‌లో కెరీర్ చేస్తానని అవినాష్ చిన్నతనంలో అనుకోలేదు. ఒకప్పుడు ఇటుక బట్టీలో పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. అవినాష్ రైతు కుటుంబం నుంచి వచ్చినందున పొలాల్లో కూడా కష్టపడి పనిచేశాడు. అయితే 12వ తరగతి ఉత్తీర్ణత సాధించడంతో అవినాష్ ఇండియన్ ఆర్మీలో చేరాడు. అతను భారత సైన్యంలోని 5 మహర్ రెజిమెంట్‌లో భాగమయ్యాడు. సైన్యంలో పనిచేస్తున్నప్పుడు అతను రాజస్థాన్‌లోని మండుతున్న ఎడారి నుండి సియాచిన్‌లోని గడ్డకట్టే హిమానీనదం వరకు డ్యూటీ చేశాడు.
2015 నుంచి అవినాష్ కెరీర్ మలుపు
అవినాష్ సాబ్లే 2015 సంవత్సరం నుండి ఆర్మీ అథ్లెటిక్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం ప్రారంభించాడు. అవినాష్ క్రాస్ కంట్రీ పోటీకి ఎంపికయ్యాడు. అక్కడి అతని ప్రతిభ అందరికీ కనిపించింది. దీని తర్వాత అతను వెనుదిరిగి చూడలేదు. కష్టపడి విజయం సాధించడం కొనసాగించాడు.
We’re now on WhatsApp. Click to Join.
చీలమండ గాయం కారణంగా అవినాష్ సాబ్లే ఆసియా క్రీడలు 2018 నుండి తప్పుకున్నారు. అయినా పట్టు వదలకుండా 2023 ఆసియా క్రీడల్లో 3 వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌ను 8.19.53 సమయంలో పూర్తి చేసి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అవినాష్ ఇటీవలే డైమండ్ లీగ్‌లో 3 వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌ను 8.09.91 సమయంలో పూర్తి చేశాడు. 8.11.20న లీగ్‌లో తన పాత జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించాలన్నది అవినాష్ కల. దేశ ప్రజలు కూడా అవినాష్ పై పూర్తి అంచనాలు పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 2024 ఒలింపిక్స్‌లో అవినాష్ భారత్ ప్రజల కలను నెరవేర్చుకోగలడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.