Australian Open Final: ఆష్లే బార్టీదే ఆస్ట్రేలియన్ ఓపెన్
ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ , వరల్డ్ నెంబర్ వన్ ఆష్లే బార్టీ చరిత్ర సృష్టించింది. 44 ఏళ్ళ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.
- By Balu J Published Date - 04:42 PM, Sat - 29 January 22

ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ , వరల్డ్ నెంబర్ వన్ ఆష్లే బార్టీ చరిత్ర సృష్టించింది. 44 ఏళ్ళ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. ఫైనల్లో బార్టీ 6-3,7-6 స్కోర్ తో అమెరికాకు చెందిన డానియలీ రోజ్ కోలిన్స్ పై విజయం సాధించింది. గంటా 27 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో ఆష్లే బార్టీ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. తొలి సెట్ ను సునాయాసంగా గెలుచుకున్న బార్టీకి రెండో సెట్ లో కోలిన్స్ నుండి కాస్త ప్రతిఘటన ఎదురైంది. రెండో సెట్ ఏడో గేమ్ నుండీ అద్భుతంగా పుంజుకున్న కోలిన్స్ వరుస బ్రేక్ పాయింట్లతో స్కోర్ సమం చేసింది. చివరికి టై బ్రేక్ లో ఆధిపత్యం కనబరిచిన బార్టీ 7-2 స్కోర్ తో సెట్ పాటు మ్యాచ్ నూ కైవసం చేసుకుంది. ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ , వింబుల్డన్ గెలిచిన బార్టీ తొలిసారి సొంతగడ్డపై ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం చేసుకుంది. అలాగే 1978 తర్వాత ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడం ఇదే తొలిసారి. 1978 లో చివరిసారిగా క్రిస్టీనా ఓనిల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచింది. సొంతగడ్డపై టైటిల్ ఫేవరెట్ గా దిగిన ఆష్లే బార్టీ ఇప్పుడు ఏడాది తొలి గ్రాండ్ శ్లామ్ నూ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.